mt_logo

ఎ మిషన్ విత్ ఎ విజన్..

నవ తెలంగాణ సినిమా

నిజానికి తెలంగాణ సినిమాకు తెలుగు సినిమాకున్నంత చరిత్ర ఉంది. ఇక్కడ 1922లోనే సినిమా నిర్మాణం మొగ్గ తొడిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా రూపొందిన సినీ కళకు గ్రహణం పట్టి ఆంధ్రాప్రాంత సినిమాదే ఆధిపత్యంగా మారింది. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ సినిమా కూడా జూలు విదిల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో మన సినిమా భవిష్యత్‌ను ఆవిష్కరించే ప్రయత్నమే ఇది….

మొదటినుంచీ సినీ నిర్మాతలు, దర్శకులు, జర్నలిస్టులు అందరూ కూడా ఆంధ్రాప్రాంత తెలుగు సినిమాని హైలెట్ చేసే వ్యూహంలో భాగంగా తెలంగాణ సినిమా, దాని చరిత్రను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేశారు. ఒకదశలో ఆంధ్రాప్రాంత సినిమాలతోనే తెలుగు సినిమా, తెలంగాణ సినిమా కూడా ఆవిర్భవించిందనే అవాస్తవిక నమ్మకాన్ని కలిగించారు. కానీ వాస్తవం ఇందుకు పూర్తిగా భిన్నం. హైదరాబాద్ స్టేట్‌కాలంనాటి చారిత్రక ఆధారాలను, 19వ శతాబ్దపు ఉత్తరకాలంనాటి రికార్డులను పరిశీలిస్తే మరుగున పడ్డ ఎన్నో నిజాలు బయటపడ్డాయి. అందులో ప్రధానమైనది.. హైదరాబాద్ కేంద్రంగా స్వాతంత్య్రానికి పూర్వమే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సినిమా జయకేతనం ఎగురవేసిందనేది కూడా ఒకటి!

తొలిదశ తెలంగాణ సినిమా

తెలుగులో తొలిమూకీ సినిమా భీష్మ ప్రతిజ్ఞను రఘుపతి వెంకయ్య తీసినకాలంలోనే అంటే 1921లోనే హైదరాబాద్ రాష్ట్రంలో కూడా సినీకళ ఆరంభమైంది. అదే యేడు ఇక్కడ ధీరేన్ గంగూలీ ఇంగ్లండ్ రిటర్న్ అనే మూకీ సినిమాను తీశారు. జన్మతః బెంగాలీ అయిన ధీరేన్ నిజాంకాలేజ్‌లో ఆర్ట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరి తన చొరవతో అప్పటి నైజాం ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇంగ్లండ్ రిటర్నే కాకుండా ఇంకెన్నో చిత్రాలు తీశాడు. అలా 1922లో ఆయన ది లేడీ టీచర్ పేరిట పూర్తిగా హైదరాబాద్‌లోనే ఓ సినిమా తీశాడు. ఆ తర్వాత 1923లో ది స్టెప్ మదర్, చింతామణి, యయాతి వంటి పది సినిమాలు నిర్మాణమయ్యాయి. అది మొదలు ఓ పదేళ్లపాటు మూకీ సినిమాల నిర్మాణం, ప్రదర్శన విస్తృతస్థాయిలోనే జరిగింది కానీ 1935 తర్వాత వేర్వేరు కారణాలవల్ల తెలంగాణ సినిమా వెనుకంజ వేసింది.

మలిదశ తెలంగాణ సినిమా
1935 తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాల కాలం అంటే 1974 వరకూ తెలంగాణ సినిమా అంతగా నిర్మాణంకాలేదు. 1974లో శ్యామ్‌బెనెగళ్ అంకుర్ తో జాతీయ స్థాయిలో, 1975లో చిల్లర దేవుళ్లుతో రాష్ట్రస్థాయిలో తెలంగాణ సినిమా తన ఉనికిని చాటి ప్రత్యేకతను నిలుపుకున్నది. ఆ తర్వాత వచ్చిన మా భూమి, రంగులకల, దాసి, కొమురం భీమ్, విముక్తికోసం, మట్టి మనుషులు వంటి సినిమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కేవలం తెలంగాణ సినిమాకే కాక మొత్తం భారతీయ సినిమాకే పేరు ప్రఖ్యాతులను సాధించిపెట్టాయి. 1998లో వచ్చిన హైదరాబాద్ బ్లూస్ వంటి సినిమాలతో భారతీయ సినిమాలోనే హింగ్లీష్, క్రాసోవర్ అనే సినిమా జానర్ మొదలై అనంతరం అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్ వంటి హైదరాబాద్ సినిమాగా ఎదిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమయ్యాక ఉద్యమ నేపథ్యం, స్ఫూర్తితో తీసిన సినిమాలు మెయిన్‌స్ట్రీమ్ తరహాలో రూపొంది ప్రజలను చైతన్యవంతం చేశాయి.

కథలకు, టాలెంట్‌కు కొదవలేదు
ఎంతో చారిత్రక నేపథ్యం, భౌగోళిక వైవిధ్యం, భిన్న జీవన సంస్కతి ఉన్న తెలంగాణలో సినిమాకు అనుగుణమైన కథలకు కొదవలేదు. అలాగే ఇటీవలికాలంలో టాలీవుడ్, బాలీవుడ్‌లలో రాణిస్తున్న సినీకళాకారులు, రచయితలు, దర్శకులలో తెలంగాణవారు కూడా రాశిపరంగా, వాసిపరంగా కూడా మెండుగానే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుత మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ తెలుగు సినిమాల్లో తెలంగాణ రచయిత, దర్శకుల ప్రమేయంలేని సినిమా ఏదీ లేదనడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. ఆ లెక్కన సినీ సృజనలో సమకాలీన తెలంగాణ యువ దర్శక, రచయితలు, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు మంచి ఊపుమీదున్నారనే చెప్పాలి. అయితే వీరిలో ఎక్కువమంది మెయిన్‌స్ట్రీమ్ తెలుగు సినిమా ప్రభంజనంలో పడిపోయి ఆ ఒరవడిలోనే సినిమాలు రాస్తున్నారు, తీస్తున్నారు. ఇప్పుడు వీరి దృష్టిని, వీరి ఆలోచనా సరళిని తెలుగు సినిమాల మీదినుంచి తెలంగాణ సినిమాల దిశగా మళ్లించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ నేపథ్యం, భాష, యాస, కథావస్తువులతో తెలంగాణ సినిమాలను కమర్షియల్ తరహాల్లోనే అయినా విస్తృతం చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. ఎంతో టాలెంట్ ఉన్న దర్శకులు, రచయితలు, కళాకారులు, గీత రచయితలు ఇంకా ఆంధ్రా ప్రాంత తెలుగు సినిమాల్లో స్థానం కోసం వెంపర్లాడడం మానాలి. అందులోంచి విముక్తి పొంది తెలంగాణ సినిమాకోసం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిన సమయం ఇదే!

తెలంగాణ సినిమా ప్రత్యేకత
ఇప్పటివరకు వచ్చిన తెలంగాణ సినిమాలు తెలంగాణ సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. తెలంగాణ సినిమాల్లో కథ, నాయకులు, వస్తువు అన్నీ సామాన్య ప్రజల వైపునే నిలిచాయి. అట్లాగే అభూతకల్పనలు, అవాస్తవిక సన్నివేశాలతో కూడిన కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, ఆర్ట్/ పాపులర్ సినిమాలను తెలుగు గడ్డమీద బతికించిన ఘనతనూ సొంతం చేసుకున్నాయి. మరోవైపు 1990 దశకం నుంచి తెలంగాణ సినిమా అంటే నక్సలైట్ కథావస్తువుల సినిమానే అనే పరిమిత దృష్టిని సోకాల్డ్ టాలీవుడ్ వర్గాలు ఏర్పర్చాయి. కానీ ఈ పరిమిత దృష్టికన్నా విస్తత క్యాన్వాస్ తెలంగాణ కథలది. ఆ దిశగా ఇప్పుడు మనల్ని మనం సరికొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన సందర్భం వచ్చింది.

విజన్‌తో కూడిన మిషన్
మన రాష్ట్రం, మన పాలన సాకారమైన ఈ వేళ తెలంగాణ సినిమా అభివద్ధి కోసం నిర్దిష్టవ్యూహంతో ప్రభుత్వం, ప్రజలు, సినీరంగ కళాకారులు, దర్శకులు, రచయితలు, పెద్దలు ముందుకు వెళ్లడం తక్షణ కర్తవ్యం. దీనికోసం ఓ స్పష్టమైన విజన్‌ని మిషన్ స్థాయిలో తీసుకెళ్లాలి. తెలంగాణ సినిమా విస్తరణ, వికాసం కోసం దానికి భవిష్యత్తులో ఉన్న అవకాశాల గురించి ప్రభుత్వం ఓ విధాన నిర్ణయాన్ని ప్రకటించాలి. దీనికోసం ప్రఖ్యాత దర్శకులు బి. నరసింగరావు, శ్యామ్‌బెనెగళ్ వంటివారి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పరిచి ఓ విజన్ డాక్యుమెంట్‌ని రూపొందించాలి. జాతీయస్థాయిలో నేషనల్ ఫిలిండెవలప్‌మెంట్ కార్పొరేషన్ లాగా తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఔత్సాహిక దర్శకులు, రచయితలు తీసే లోబడ్జెట్ సినిమాలకు ఆర్థికసాయం అందించే పథకాలను ఆరంభించాలి. పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ తరహాలో తెలంగాణ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించాలి. వీలుంటే ఎఫ్‌టీఐఐతో అనుసంధానం చేయడం మంచిది. ఈ సంస్థలో సినిమాస్క్రిప్ట్ రచన నుంచి మొదలు దర్శకత్వం, ఎడిటింగ్, నటన వంటి అన్ని క్రాఫ్ట్‌లపై డిగ్రీస్థాయి శిక్షణనివ్వాలి.

ఇటీవలికాలంలో కాలేజ్ యూత్ షార్ట్ ఫిలింస్‌ని, డాక్యుమెంటరీస్‌ని విస్తృతంగా తీస్తున్నారు. ఈ యంగ్ టాలెంట్‌ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రతియేటా షార్ట్‌ఫిలిం డాక్యుమెంటరీ కాంపిటీషన్స్‌ని నిర్వహించాలి. అలాగే ఎంపిక చేసిన వాటిని ప్రదర్శించుకునే అవకాశాన్ని కల్పించాలి. అయితే ఈ దిశగా ఇప్పటికే అల్లాణి శ్రీధర్ తెలంగాణ థీమ్‌తో షార్ట్ ఫిలిం కాంపిటీషన్‌ని ప్రకటించాడు. ఇది అభినందించదగ్గ విషయం. ఇలా వ్యక్తిపరంగా చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వపరమైన తోడ్పాటు, ఓ వ్యవస్థ అండగా ఉంటే మరింత ప్రాచుర్యంలోకి వస్తుంది. కనీసం రెండేళ్లకోసారైనా తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (TIFF)ని నిర్వహించి ఈ ఫెస్టివల్ విదేశాలలోని ఉత్తమ చిత్రాలను ఆహ్వానించి తెలంగాణ సినీ సృజనకారులకు వరల్డ్ సినిమాతో ఎక్స్‌పోజర్‌నిచ్చే అవకాశాన్ని కల్పించాలి.

దీంట్లో తెలంగాణ సినిమా పేరిట రెట్రాస్పెక్టివ్ కూడా ఏర్పాటు చేయాలి. అలాగే ఎంపికచేసిన తెలంగాణ సినిమాలను ప్రదర్శించి వాటికి ప్రపంచస్థాయి మార్కెట్‌ను క్రియేట్ చేయాలి. తెలంగాణలో సినిమాల నిర్మాణానికి ప్రత్యేకమైన రాయితీలు, సబ్సిడీలు, వినోదపన్ను మినహాయింపును ఇవ్వాలి. జిల్లాస్థాయిలో ఫిలింసొసైటీలు, యూనివర్శిటీ, డిగ్రీ స్థాయిల్లో ఫిలింక్లబ్‌లను ఏర్పాటు చేయాలి. ఈ మేరకు కరీంనగర్ ఫిలింసొసైటీతరహాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటుచేయాలి. తెలంగాణ సినిమాలకు ప్రతి దసరాకు అవార్డులను (నంది, జాతీయ అవార్డుల తరహాలో)అందిచండం ఆరంభించాలి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన తెలంగాణవారు ఇద్దరున్నారు. శ్యామ్‌బెనెగళ్, పైడిజైరాజ్. వీరి జన్మదినాన్ని లేదా మరేదైనా ప్రత్యేకదినాన్ని తెలంగాణ సినిమాదినోత్సవంగా ప్రకటించి ఆరోజు ప్రత్యేకకార్యక్రమాల రూపకల్పన చేయాలి!
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *