mt_logo

9గంటల్లో 10 సభలు!..

ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఆదివారం నిర్వహించిన ప్రచారభేరి జోరు ఆశ్చర్యం కలిగించింది. ఒకేరోజు 9గంటల్లో 10 సభల్లో పాల్గొని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చరిత్ర సృష్టించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారం వేగంగా ముందుకు దూసుకుపోతుంది. రోజుకు 9 నుండి 10 సభలదాకా నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి. ఆదిలాబాద్, నిర్మల్, ఇచ్చోడ, ఉట్నూర్, భైంసా, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, సిర్పూర్, రామగుండం లలో నిర్వహించిన బహిరంగసభల్లో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని, పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి బీడుభూములను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల భద్రత కోసం పాటుబడే పోలీసులకు వారాంతపు సెలవు సదుపాయం కల్పిస్తామని, మైనారిటీల అభివృద్ధికి వెయ్యికోట్లతో ప్రత్యేక ప్యాకేజి ఏర్పాటు చేస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

తెలంగాణ కాశ్మీర్ అయిన ఆదిలాబాద్ జిల్లా సీమాంధ్రుల పాలనలో నిర్లక్ష్యానికి గురైందని, టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ జిల్లాను గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. వృద్ధులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500 పెన్షన్ ఇస్తామని, రూ. 3లక్షలతో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని పేదలందరికీ నిర్మించి ఇస్తామని, మహిళలకు రూ. 10 లక్షలవరకూ వడ్డీ లేని ఋణసౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్, దానిచుట్టూ సీమాంధ్రులు కబ్జా చేసిన లక్షల కోట్ల విలువైన భూములను లాక్కుంటామని, చంద్రబాబు, వెంకయ్యనాయుడు చేతులుకలిపి టీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

కేవీపీ రామచంద్రరావుతో చేతులుకలిపిన పొన్నాల ముమ్మాటికీ సన్నాసేనని మరోసారి కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాకుండా అడ్డుపడిన కేవీపీతో కుమ్మక్కైన పొన్నాల తెలంగాణలో పుట్టినందుకు బాధపడుతున్నానని, బంగారు తెలంగాణ కావాలంటే టీఆర్ఎస్ కే ఓట్లువేసి గెలిపించాలని, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే స్వచ్చమైన తెలంగాణను చూస్తామని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *