mt_logo

తెలంగాణలో 700 కోట్లతో ఇథనాల్ పరిశ్రమ : మంత్రి కొప్పుల ఈశ్వర్

తెలంగాణాలో 700 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ పరిశ్రమ ప్రారంభం కానుంది. ధర్మపురి నియోజకవర్గ పరిధి వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ పరిధిలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. పరిశ్రమ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని క్రిశాంత్ భారతీ కో ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్ కో) చైర్మన్, డైరెక్టర్లు, వైస్ చైర్మైన్లతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారులతో కలిసి స్థంభంపల్లి గ్రామంలోని దాదాపు 500 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశ్రమ ఏర్పాటుకు ఇవ్వనున్నారు. అనంతరం క్రిభ్ కో చైర్మన్ డా. చంద్రపాల్ సింగ్ మాట్లాడుతూ.. దేశంలో 3 ప్రదేశాలలో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని, గుజరాత్ రాష్ట్రంలో సూరత్, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణపట్నం, తెలంగాణలో ప్రభుత్వం సూచించిన ధర్మపురిలోని వెల్గటూర్ మండలంలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 700 కోట్ల పెట్టుబడితో త్వరలో పనులు ప్రారంభిస్తామని, ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రతి సంవత్సరం 8 కోట్ల లీటర్ల ఇథనాల్ తయారు చేస్తామని, దీనికోసం ప్రతి సంవత్సరం దాదాపు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల నూకలు, చెడిపోయిన బియ్యం, మక్కలు కొనుగోలు చేస్తామని అన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రజలు స్వాగతించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.రవితోపాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *