మూడో రోజు రూ.687.89 కోట్ల రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. 13,75,786 ఎకరాలకు సంబంధించిన నిధులను ఆయా ఖాతాల్లో జమ చేసినట్టు పేర్కొన్నారు. పెట్టుబడి కోసం ఒకనాడు వడ్డీవ్యాపారుల ముందు చేయి చాపిన రైతులు, నేడు ప్రభుత్వ సాయంతో దైర్యంగా వ్యవసాయం చేస్తున్నారని మంత్రి అన్నారు. కొంతమంది ప్రభుత్వం ఏం చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతుబంధు, రైతుభీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు ఏవీ లేవని.. మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను కేసీఆర్ అమలు చేసి, ప్రజలను ఆదుకుంటున్నాడని మంత్రి నిరంజన్ రెడ్డి తెలియజేశారు.
ఉమ్మడిరాష్ట్రంలో వృద్దులకు రూ.200, దివ్యాంగులకు రూ.500 మాత్రమే పెన్షన్ ఇచ్చారని… కేసీఆర్ పెద్దమనసుతో వాటిని రూ.2016, రూ.3016 కు పెంచారని అన్నారు. గురుకులాలతో విద్యారంగంలో, వైద్యకళాశాలలతో వైద్యరంగంలో కనీవినీ ఎరుగని విప్లవాత్మక మార్పులు చేచించిన వ్యక్తి దేశంలో కేసీఆర్ మాత్రమేనని అన్నారు. రైతులకు చేయూతనిచ్చిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, పనిచేసిన ప్రభుత్వానికి ప్రజల ఆదరణ ఉంటుందని మంత్రి తెలిపారు. కేసీఆర్ మీద ప్రజలకు అపారవిశ్వాసం ఉందని, అబద్దపు ప్రచారాలతో ప్రజల ద్రుస్తి మళ్లించలేరని స్పష్టం చేశారు.