తెలంగాణ అభివృద్ధి జరగకుండా 60 ఏళ్లుగా ఆంధ్రా పాలకులు కుట్రలు చేశారని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో హుజూర్ నగర్, నాగార్జున సాగర్ కు చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
సీమాంధ్ర నాయకత్వానికి అమ్ముడుపోయి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, కాంగ్రెస్, టీడీపీ ఏనాడూ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడలేదన్నారు. పత్రికా స్వేచ్ఛ పట్ల ప్రభుత్వానికి ఎంతో గౌరవముందని, సీమాంధ్ర మీడియా సీఎం కేసీఆర్ పట్ల విషప్రచారం చేస్తుందని, ప్రభుత్వాన్ని భయపెడదామనుకుంటే మీ ఆటలు సాగవని హెచ్చరించారు. విద్యుత్ విషయంలో దొంగలెవరో ప్రజలకు తెలుసని, తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాను చంద్రబాబు అడ్డుకుంటున్నారని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.