mt_logo

ఆహార భద్రత కార్డుల జారీకి గడువుతో సంబంధం లేదు – కేటీఆర్

పెన్షన్లు, ఆహార భద్రత కార్డుల జారీ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అని, గడువుతో సంబంధం లేదని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల దరఖాస్తు విధానంపై అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. తెల్ల కాగితంపై కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, పించన్లు, ఆహార భద్రత కార్డుల జారీ విషయంలో దళారులను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. మిగులు విద్యుత్ పై తాము సంప్రదించలేదనడం అవాస్తవమని, విద్యుత్ వాటాపై ఏపీ ప్రభుత్వం మానవతను చాటుకోవాలని, జీవో నం. 111పై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తాము నడుచుకుంటామని కేటీఆర్ చెప్పారు.

ఇదిలా ఉండగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రాట్ అండ్ విట్నీ కస్టమర్ ట్రైనింగ్ సెంటర్ కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. హైదరాబాద్ ఏరో స్పేస్ హబ్ కు ప్రాట్ అండ్ విట్నీ ఉపయోగపడుతుందని, దీనికి సంబంధించిన ఇంజిన్ తయారీ కేంద్రాన్ని కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అనంతరం రాజేంద్రనగర్ లోని ఎన్ఐఆర్డీ(జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ) ని కేటీఆర్ సందర్శించి పలు గ్రామీణాభివృద్ధి మోడల్స్ ను పరిశీలించారు. గ్రామాల అభివృద్ధికి ఎన్ఐఆర్డీ సహకారం అందించాలని, గ్రామాల్లో సోలార్ స్ట్రీట్ లైట్ల ఏర్పాటుకు ప్రణాళికలు ఇవ్వాలని అధికారులను కేటీఆర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *