సూర్యాపేట జిల్లా పంటల ఖిల్లాగా మారింది. గతంలో జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు సాగునీరు లేక దాదాపు 70 శాతానికి పైగా వ్యవసాయ భూములు బంజరులుగా దర్శనమిచ్చేవి. నేడు కృష్ణా, గోదావరి, మూసీ నదులతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడంతో దశాబ్దాలుగా నీటి చుక్కకు నోచుకోని బీడు భూములకు మహర్దశ పట్టింది. దీనితో మూడేండ్లలో సాగు విస్తీర్ణం మూడింతలు పెరిగింది. నాగార్జునసాగర్ కాల్వ ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరు అందుతుండగా.. సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన కాళేశ్వరంతో 2.93 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందుతున్నాయి. మరోవైపు మూసీ నదితో 25 వేల ఎకరాలు సాగవుతున్నది. అయితే జిల్లా వ్యాప్తంగా 6.21 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా, 2018కి ముందు వరితోపాటు ఇతర పంటలు కలిపి 2.50 లక్షలకు మించి సాగుకు నోచుకోకపోయేది. నేడు ఏకంగా 6.18 లక్షల ఎకరాలు సాగవుతుండటం విశేషం.
నాగార్జున సాగర్ ద్వారా:
నాగార్జునసాగర్ ఆయకట్టు అయిన హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో సుమారు 2.55 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో సాగర్ కాలువ కింద ఉన్న లిఫ్ట్‌లకు నిధులు మంజూరు అయ్యాయి. ఆధునీకరణతో 45 వేల ఎకరాలు స్థిరీకరణ జరిగింది. మొత్తం ఆయకట్టు 3 లక్షల ఎకరాలకు చేరింది.
మూసీ ద్వారా:
సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని 40 వేల ఎకరాలకు సాగునీటిని అందించే మూసీ ప్రాజెక్టును గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టే లీకేజీల రూపంలో దిగువకు వెళ్లేవి. ఏడాదిలో ఒక్క పంట.. అది కూడా ఆరుతడి పంటలు 16 వేల ఎకరాలకు మించి ఏనాడూ సాగు కాలేదు. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో సీఎం కేసీఆర్ రూ.20 కోట్లు మంజూరు చేయగా ప్రాజెక్టుకు కొత్త గేట్లు అమర్చారు. నేడు ఏడాదిలో రెండు పంటలకు 40 వేల ఎకరాల భూమి సాగవుతున్నది. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 25 వేల ఎకరాల వరకు నీరందుతున్నది.
కాళేశ్వరం నుంచి గోదావరి:
కాళేశ్వరం పూర్తితో గోదావరి జలాలు సూర్యాపేటకు చేరుకున్నాయి. దీంతో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలోని 2.40 లక్షల ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందుతున్నది. చెరువులు, కుంటలు నింపడంతో మరో 53 వేల ఎకరాలు స్థిరీకరణ జరిగి మొత్తం 2.93 లక్షల ఎకరాలకు నీరందుతున్నది. ఇలా సూర్యాపేట జిల్లాలో మూడు నదులు ప్రవహిస్తుండగా అనతి కాలంలోనే బీడుభూములన్నీ సాగులోకి వచ్చి, సాగు మూడింతలు పెరిగడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.