రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్ రోగులకు అందిస్తున్న ఉచిత చికిత్సలో రికార్డ్ సాధించింది. రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి ఇప్పటివరకు డయాలసిస్ రోగులకు చేసిన సెషన్ల సంఖ్య 50 లక్షలు దాటింది. సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయం ఫలితంగా నియోజకవర్గానికి ఒక కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేయగా… ఇప్పటి వరకు రూ.700 కోట్లు ఖర్చు చేశారు.
డయాలసిస్ చికిత్స భారీ ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం. కిడ్నీ రోగుల వ్యాధి తీవ్రతను బట్టి వారానికి మూడునాలుగు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే నెలకు కనీసం 10-12 సెషన్లు అవసరమవుతాయి. దానికి తోడు మందులు, ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి, కిడ్నీ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డయాలసిస్ సేవలు అందించాలని నిర్ణయించారు. అలాగే వారికి పెన్షన్లు, బస్‌పాస్‌లు, మందులు ఇవ్వడం వంటి నిర్ణయాలు రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయి.
అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లో మాత్రమే ఉచిత డయాలసిస్ సేవలు అందేవి. చాలా తక్కువ మందికే ఇక్కడ సేవలు దక్కేవి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోగులంతా ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వచ్చేది. చాలా మంది రోగులు అటు ఖర్చు పెట్టలేక, ఇటు హైదరాబాద్‌కు వచ్చి డయాలసిస్ చేయించుకోలేక ఇబ్బందులు పడేవారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు ఈ కేంద్రాల సంఖ్య 82కు పెరిగింది. అంటే సుమారు 28 రెట్లు పెరిగింది. నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రం ఉండేలా మొత్తం 102 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రసుత్తం రాష్ట్రంలో సుమారు 12 వేల మంది వరకు డయాలసిస్ అవసరమైన కిడ్నీ రోగులు ఉన్నట్టు అంచనా. వీరిలో 10 వేల మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డయాలసిస్ సేవలు పొందుతున్నారు.
డయాలసిస్ రోగులకు సంబంధించిన ప్రతి సమస్యను సీఎం కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరిస్తున్నారు. గతంలో డయాలసిస్‌లో వాడే ఫిల్టర్లను ఒకరికి మించి వాడేవారు. దీని వల్ల ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ‘సింగిల్ యూజ్’ ఫిల్టర్లు వాడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. తమిళనాడులోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేస్తున్నారు. రోగులు డయాలసిస్ కోసం దవాఖానకు వచ్చి వెళ్లేందుకు ఆర్థికభారం పడకుండా దేశంలోనే తొలిసారిగా ఉచిత బస్ పాస్ ఇస్తున్నది. అలాగే, ఆసరా పథకం కింద రూ.2,016 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదువేల మందికిపైగా ఈ పింఛన్ పొందుతున్నారు.
డయాలసిస్ రోగులకు దాత లభించినప్పుడు ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అవయవ మార్పిడి సర్జరీ చేయిస్తున్నది. నిమ్స్, ఉస్మానియా, గాంధీలో ఏటా 150కి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు పూర్తి ఉచితంగా జరుగుతున్నాయి. ఖరీదైన మందులను జీవితాంతం ఉచితంగా అందిస్తున్నారు.