పాదచారులకు అనుకూలమైన నగరంగా హైదరాబాద్ రూపు దిద్దుకుంటోంది. నగరంలో ప్రపంచస్థాయి పరిశ్రమలు నెలకొల్పడం, ఇతర ప్రాంతాల నుంచి ప్రతి యేటా లక్షలాది మంది ఇకడే స్థిర నివాసం ఏర్పర్చుకోవడంతో నగరంలో వాహనాల రద్దీ పెరిగింది. దీంతో పాదచారులు(పెడెస్టేరియన్)ఇరువైపులా సురక్షితంగా రోడ్డు దాటడం కష్టంగా మారింది. ఇందు కోసం పాదచారుల రక్షణ, భద్రతకు జీహెచ్‌ఎంసీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ముందుగా ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు ఫుట్‌పాత్ ల నిర్మాణం, పాదచారులకు సిగ్నల్ వ్యవస్థ, తోడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో సురక్షితంగా రోడ్డు దాటేందుకు 94 పాదచారుల సిగ్నల్స్ ఏర్పాటు చేయడంతోపాటు స్వయంగా పాదచారులే సిగ్నల్స్‌ను ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించారు.
తెలంగాణ రాకముందు 415 కిలోమీటర్లు ఉన్న ఫుట్‌పాత్, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు 817 కిలోమీటర్లను రూ.32.75 కోట్ల వ్యయంతో నిర్మించారు. దానికి తోడు ట్రాఫిక్ సమస్య ఎకువగా ఉన్న ప్రాంతాల్లో పాదచారులకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గతంలో 20 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించగా.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను రూ.75.65 కోట్లతో చేపట్టారు. ఇప్పటి వరకు 8 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి రాగా.. త్వరలో మిగిలినవి కూడా అందుబాటులోకి రానున్నాయి.
సిగ్నల్స్, ఫుట్‌పాత్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలే కాకుండా నగరంలో ఇటీవల జోన్‌కు 2 చొప్పున ప్రయోగాత్మకంగా చేపట్టిన 12 జంక్షన్ల విస్తరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ రద్దీ ఎకువగా ఉన్న సమయంలో పాదచారుల హడావుడికి ఆస్కారం ఇవ్వకుండా ప్రశాంతంగా వెళ్లేందుకు సిట్టింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ 12 జంక్షన్లలో కొన్నింటి అభివృద్ధిని సీఎస్‌ఆర్ పద్ధతిలో చేపట్టేందుకు పలువురు ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆ పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటికి తోడు నగరంలో మరో 102 జంక్షన్ల అభివృద్ధికి, సుందరీకరణ పనులు చేపట్టి ట్రాఫిక్ నియంత్రణతో పాటుగా పాదచారుల భద్రతకు కూడా ప్రాధాన్యతనిచ్చారు. ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి హైదరాబాద్ మెట్రోరైల్ ఆధ్వర్యంలో చేపట్టిన 60 మెట్రో రైలు స్టేషన్ల వద్ద కూడా పాదచారుల రక్షణ, ప్రమాదాల నివారణకు రోడ్డు దాటకుండా రెండువైపులా వెళ్లేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణాలతో పాదచారుల అనుకూల నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రూ.75.65 కోట్లతో 22 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు :
కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు చెన్నై షాపింగ్ మాల్ మదీనాగూడ, యశోద కాంప్లెక్స్ మియాపూర్, హైదరాబాద్ సెంట్రల్ మాల్ పంజాగుట్ట, ఎన్‌ఎస్‌కేకే సూల్ దగ్గర బాలానగర్, నేరేడ్‌మెట్ బస్టాప్, సెయింట్ ఆన్స్ సూల్ సికింద్రాబాద్, స్వప్ప థియేటర్ రాజేంద్రనగర్, ఈఎస్‌ఐ హాస్పిటల్ ఎర్రగడ్డ అందుబాటులోకి వచ్చాయి. చేపట్టిన 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల్లో బంజారాహిల్స్‌లో 3డి ఎఫెక్ట్‌తో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నారు.