mt_logo

ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటును తగ్గించడానికి 3 టైర్ సిస్టం : మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటును తగ్గించడానికి 3 టైర్ సిస్టం ప్రవేశపెట్టామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. నిమ్స్ వేదికగా హాస్పిటల్ ఇన్‌ఫెక్షన్, ప్రివేన్షన్, కంట్రోల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని, ఒక ముఖ్యమైన నూతన విధానం వైపు మనం అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ఇన్‌ఫెక్షన్ రేటును తగ్గించేందుకు హాస్పిటల్లో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు వేశామని, ఇందులో సూపరిండెంట్, మైక్రో బయాలజీ హెచ్ఓడి, నర్సింగ్ హెచ్‌వోడీ ఉంటారని చెప్పారు. ప్రతి సోమవారం మీటింగ్ పెట్టుకొని చర్చిస్తారు. అదనంగా ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్ (డాక్టర్), ప్రత్యేకంగా స్టాఫ్ నర్స్‌ను నియమించామని పేర్కొన్నారు. వారికి ఇవాళ శిక్షణ ప్రారంభించుకున్నామని తెలిపారు. ముందుగా టీచింగ్ హాస్పిటల్స్ సిబ్బందికి శిక్షణ ఇచ్చి, తర్వాత టీవీవీపీ, ఆ తర్వాత పీహెచ్‌సీ సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు.

మెడికల్ ఫీల్డ్‌లో నిరంతరం నేర్చుకున్నప్పుడే మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఈ శిక్షణను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయించాము. థియేటర్లు, ప్రసూతి గదులు, డయాలసిస్ వార్డుల్లో ఇన్ఫెక్షన్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దాన్ని అరికట్టాలంటే అంతే జాగ్రత్తగా ఉండాలి. పరిశుభ్రత పాటించాలి. అక్కడ ఉండే గాలి కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఇన్‌ఫెక్షన్ వస్తే మీరు బాధ్యత తీసుకోవాలని ఆసుపత్రి సిబ్బందికి మంత్రి సూచించారు..

నిమ్స్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ కన్నా తక్కువ కాదని హరీశ్‌రావు పేర్కొన్నారు. రూ. 20 కోట్లతో ఎక్విప్మెంట్ మేనేజిమెంట్ పాలసీ తీసుకొచ్చి ఫోన్ కాల్ లేదా మెయిల్ చేస్తే మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. రూ. 30 కోట్లతో మార్చురీలు అధునికరిస్తున్నామని తెలిపారు. 56 హై ఎండ్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్లు తెప్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వచ్చే పేదలకు సేవ చేయడంలో అద్భుతమైన సంతృప్తి దొరుకుతుందన్నారు. రాష్ట్రంలో ఇన్‌ఫెక్షన్ రేటును7 శాతం కన్నా తక్కువకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *