దళితబంధు పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో 250 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను దళితబంధును ప్రయోగాత్మకంగా అమలుచేయనున్న నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాలకు కేటాయించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి 100 కోట్లు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి 50 కోట్లు, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలానికి 50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి రూ. 50 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఎండీ కరుణాకర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో చింతకాని మండలం శాసనసభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో ఉండటం విశేషం. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలోని ఒక్కొక్క దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున 7.6 కోట్లు విడుదల చేయగా, లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్లు ఎంపిక చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టిన హుజూరాబాద్ నియోజకవర్గానికి 2 వేల కోట్లు విడుదల చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో మంచి ఫలితాలు రావడంతో గతంలో ప్రకటించిన విధంగా నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాలకు కూడా వెంటనే నిధులు విడుదలచేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించారు. దీంతో మంగళవారం నిధులు విడుదలయ్యాయి. ఈ పథకాన్ని మార్చి 2022 నాటికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు విస్తరించనున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఏడాదికి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపికచేయనున్నారు. కాగా దళితబంధు పథకం అమలు కోసం రానున్న బడ్జెట్‌లో 20 వేల కోట్ల నుంచి 25 వేల కోట్ల వరకు కేటాయించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.