mt_logo

జాతీయ పరీక్షల్లో తెలంగాణ గురుకుల విద్యార్థుల విజయ భేరి

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో తెలంగాణ గురుకుల సొసైటీకి విద్యార్థులు విజయ దుందుభి మోగిస్తున్నారు. గురుకుల విద్యాలయాల్లో చదివిన 223 మంది విద్యార్థులు దేశవ్యాప్త గొప్ప విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్, మెడిసిన్లో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సొసైటీ అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ గిరిజన, ఆదివాసీ ఆదిమ తెగల విద్యార్థులను ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలకు ఎంపిక చేసే విధంగా శిక్షణ ఇస్తూ అత్యున్నత కోర్సులలో అడ్మిషన్లు సాధిస్తోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో గిరిజన సంక్షేమ గురుకులాల నుండి విభాగాల్లో 223 మంది విద్యార్థులు గొప్ప, గొప్ప విద్యా సంస్థల్లో సీట్లు సాధించడం పట్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. గత ఆరేళ్లలో(2017 నుంచి 2021) వరకు 1286 మంది విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి, ఐఐఐటి, జిఎఫ్టీఐ, ఎంబీబీఎస్, బిడిఎస్, బిఎస్సీ అగ్రికల్చర్, ఫార్మసీ, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐఎస్ఈఆర్ , ప్రతిష్టాత్మక యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించడం ఎంతో సంతోషకరమన్నారు. విద్య ద్వారానే వికాసం జరుగుతుందని నమ్మిన ముఖ్యమంత్రి కేసిఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గురుకులాలు పెట్టి, అత్యంత వెనుకబడిన, దళిత, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడంతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను పెట్టి దేశంలోని ప్రముఖ ప్రవేశ పరీక్షలన్నింటికి అత్యుత్తమ శిక్షణ అందించడం ద్వారా ఈ వర్గాల పిల్లలు గొప్ప, గొప్ప విద్యా సంస్థల్లో ఉత్తమమైన కోర్సులలో సీట్లు సాధిస్తూ, తెలంగాణ రాష్ట్రానికి, గురుకుల విద్యా సంస్థలకు, వారి కుటుంబాలకు మంచిపేరు తీసుకొస్తున్నారని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *