హైదరాబాద్ నగరంలో ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ జామ్ లను నివారించి తక్కువ సమయంలో ప్రయాణికులు గమ్యం చేరడానికి త్వరలో రాజధానిలో 20 మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, జంక్షన్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్ట్రాటజిక్ రోడ్ డెవెలప్ మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మొదటి దశలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు రూ. 2,631 కోట్ల నిధులను మంజూరు చేస్తూ జీవో 94ను విడుదల చేసింది. ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించే టెండర్ ప్రక్రియ నెల వ్యవధిలో పూర్తవుతుంది.
ప్రాజెక్టు మార్గదర్శకాల రూపకల్పన, టెండర్ల ప్రక్రియ సజావుగా జరిపేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య వల్ల హైదరాబాద్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకపై ఇలాంటివి ఉండరాదని, ప్రణాళికాబద్ధంగా నగరాన్ని తీర్చిదిద్దాలని గతంలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ లో తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణానికి ఇలా నాలుగు దిక్కులు కలిసేలా భారీ రోడ్లు, ఫ్లైఓవర్లు, స్కైవేలు ఉండాలని సీఎం సూచించారు.