నాలుగేండ్లలో 20 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యం : మంత్రి నిరంజన్ రెడ్డి

  • January 13, 2022 4:14 pm

రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆయిల్ పామ్ సాగుకు లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ మండలం కంబళాపూర్‌లో రైతుల ఆయిల్ పామ్ క్షేత్రాలను మంత్రి పరిశీలించారు. ఆయిల్ పామ్ సాగులో దేశంలోనే అగ్రభాగంలో నిలవాలని, పంటల మార్పిడిలో ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. దేశంలో ప్రజల అవసరాలకు ఆయిల్ పామ్ సాగు 80 లక్షల ఎకరాలలో చేపట్టాల్సి ఉడగా.. ప్రస్తుతం 8 లక్షల ఎకరాలే సాగవుతున్నదని ఆయన తెలిపారు. అందుకే తెలంగాణలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరాలను వెల్లడించారు. ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుంది. తెలంగాణలో పండే ఆయిల్ పామ్ గెలలలో అధిక నూనె శాతం ఉన్నట్లు పరిశోధనా సంస్థలు వెల్లడించాయని మంత్రి తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతాంగానికి ఉపాధిహామీ కింద గుంతల తవ్వకం, మైక్రో ఇరిగేషన్ కింద డ్రిప్ పరికరాలు, అవసరమైన రైతులకు సమీప బ్యాంకులను టై అప్ చేసి రుణాలు ఇప్పించే ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నదని పేర్కొన్నారు. రాబోయే నాలుగేండ్లలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ఈ పథకాన్ని రూపొందించారు. సంప్రదాయ పంటల సాగుతో రైతులు నష్టపోకుండా పంటల మార్పిడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. మొక్కలు నాటిన తర్వాత నాలుగేళ్ల వరకు అంతరపంటలు సాగు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. కంబళాపూర్‌లో 50 పైచిలుకు ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుచేసిన రైతులు ఆనంద్ రెడ్డి, పుల్లారెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రాజవర్దన్ రెడ్డిలను మంత్రి అభినందించారు.


Connect with us

Videos

MORE