శుక్రవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2019 -2020 ఆర్ధిక సంవత్సరం కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. గత నాలుగేళ్ళుగా రాష్ట్ర సొంత రాబడులు, పన్నేతర ఆదాయం బాగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ పరిమాణం కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఈసారి బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలు దాటవచ్చని సమాచారం. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన మొత్తాలను బడ్జెట్ లో చేర్చినట్లు తెలిసింది.
కేంద్రప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన క్రమంలో అందుకు అనుగుణంగా మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టాలని సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే. పేద ప్రజలకు అందించే పించన్లను ఇప్పుడున్న దానికంటే రెట్టింపు చేస్తామని, అర్హత వయసు 60 నుండి 57 ఏండ్లకు తగ్గించాలని కూడా సీఎం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ నుండి ఇది అమలులోకి రానుంది. అర్హత వయస్సును తగ్గించడం ద్వారా అదనంగా దాదాపు 20 లక్షల మంది పించన్ పొందుతారని అంచనా. ప్రస్తుతం సామాజిక పెన్షన్ల కోసం ప్రభుత్వం ఏటా రూ. 5,043 కోట్లు వెచ్చిస్తుంది. తాజాగా పెన్షన్ల పెంపుతో మరో రూ. 5 వేలకోట్లు అదనంగా బడ్జెట్ లో కేటాయించనున్నారు.
రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఒక ఎకరం భూమికి రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ. 8 వేలు పెట్టుబడి సాయం ఇచ్చింది. ఈ ఏడాది నుండి ఆ సాయాన్ని ఎకరానికి రూ. 10 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోనే నిధులు కేటాయిస్తారని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో రైతుబంధు పథకం కింద నిధులను రూ. 12 వేల కోట్ల నుండి రూ. 15వేల కోట్లకు పెంచుతారని సమాచారం. మరోవైపు వ్యవసాయ రుణమాఫీకి రూ. 20 వేలకోట్లు కేటాయిస్తారని, రైతు భీమాకు రూ. 1500 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. వైద్య, ఆరోగ్యశాఖకు దాదాపు రూ. 10 వేల కోట్లు, బీసీలకు రూ. 5 వేల కోట్ల నుండి రూ. 6 వేలకోట్ల వరకు, ఎస్సీలకు రూ. 16 వేలకోట్లు, ఎస్టీలకు రూ. 9 వేల కోట్ల పైచిలుకు నిధులను కేటాయించే అవకాశముందని సమాచారం.