mt_logo

హైదరాబాద్ లో 15 లక్షల బోగస్ ఓట్లు!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సుమారు 15 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని, ఆధార్ నంబరుతో అనుసంధానం కాని ఓటర్లకు ఓటు హక్కు ఉండదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ సీఎం కేసీఆర్ ను కలిశారు. ఆధార్ తో ఓటరు గుర్తింపు కార్డుల అనుసంధానంపై వీరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి అని భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేస్తామని, బోగస్ ఓటర్లను ఏరివేయడానికి ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలకు సహకరిస్తామని అన్నారు. హైదరాబాద్ లోనే ఎక్కువమంది బోగస్ ఓటర్లుండే అవకాశం ఉన్నందున మొదట ఇక్కడే పని ప్రారంభించాలని కోరారు. ముందు హైదరాబాద్ లో, తర్వాత రాష్ట్రమంతా ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ ను అనుసంధానం చేస్తామని, నగరంలో ఈ కార్యక్రమాన్ని 15, 20 రోజుల్లో పూర్తి చేస్తామని సీఎం చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం ప్రకారం జనాభాలో 66% ఓటర్లుండాల్సి రాగా, హైదరాబాద్ లో ఆ శాతం చాలా ఎక్కువగా ఉందని, దాదాపు 15 లక్షల మంది బోగస్ ఓటర్లున్నట్లు అంచనా ఉందని సీఎం పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన జరగాల్సి ఉన్నందున అంతకన్నా ముందే ఓటర్ల జాబితా రూపొందించాలని కోరారు. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా, హైదరాబాద్ లోనే 24 స్థానాలు ఉన్నాయని, ఈ బోగస్ ఓట్లు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ విషయంపై రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని, ఆధార్ తో అనుసంధానం కాని వారికి ఒకటికి రెండుసార్లు విజ్ఞప్తి చేయాలని, అయినా అనుసంధానం చేసుకోకపోతే ఓటరు జాబితా నుండి వారి పేర్లు తొలగించాలని చెప్పారు. అంతేకాకుండా సాధారణ ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు ఒకే ఓటరు జాబితా ఉండాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *