ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలోని 17 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీకి 16 స్థానాలు వస్తాయని, ఎంఐఎం ఒక స్థానంలో గెలుపొందుతుందని రిపబ్లిక్ టీవీ –సీ ఓటర్ తాజా సర్వేలో తేల్చిచెప్పింది. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు ఎదురుగాలి వీస్తున్నదని, కేంద్రంలో సాధారణ మెజార్టీకి దూరంగా ఎన్డీయే, యూపీఏ ఉండబోతున్నాయని సర్వే తెలిపింది. కాగా అటు ఏపీలో వైసీపీ పార్టీ 19 సీట్లతో ఘన విజయాన్ని సాధించనుందని సర్వే పేర్కొన్నది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీల హవా ఉండనున్నదని తేల్చింది.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రికార్డుస్థాయిలో మొత్తం 42.4% ఓట్లు సాధించి అగ్రస్థానంలో నిలుస్తుందని రిపబ్లిక్ టీవీ-సీ ఓటర్ సర్వే పేర్కొంది. యూపీఏ 29%, ఎన్డీయే 12.7%, ఎంఐఎం 7.7%ఓట్లు సాధిస్తాయని సర్వే తెలిపింది. అటు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ పార్టీ కేవలం 6 స్థానాలకు మాత్రమే పరిమితం కానుండగా, వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీ 19 స్థానాలు సాధించనుందని.. కాంగ్రెస్, బీజేపీలు ఒక్క స్థానాన్ని కూడా గెలిచే పరిస్థితి లేదని సర్వే పేర్కొన్నది.
జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమికి గడ్డుకాలం తప్పదని, యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే, తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ అత్యధిక స్థానాల్లో గెలుస్తాయని సర్వే స్పష్టం చేసింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 233 స్థానాలు, యూపీఏకు 167 స్థానాలు, ఇతర ప్రాంతీయ పార్టీల అభ్యర్ధులకు 143 స్థానాల్లో గెలుస్తారని సర్వే తెలిపింది. లోక్ సభ ఎన్నికల్లో సాధారణ మెజార్టీకి మొత్తం 272 స్థానాలు అవసరం కాగా, అటు ఎన్డీయే కూటమి కానీ, ఇటు యూపీఏ కానీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే పరిస్థితి లేనందున టీఆర్ఎస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పనున్నాయని సర్వే ఫలితాల ద్వారా స్పష్టం అవుతుంది.