mt_logo

జగన్ పార్టీలోకి వలసపోతున్న నాయకుల సీనెంత?

By: సవాల్ రెడ్డి 

తెలంగాణ నేతలంతా (జగన్ ) రెడ్డి కాంగ్రెస్ లోకి క్యూలు కట్టి వెళుతున్నట్టు, ఇక్కడేదో భూకంపాలు వస్తున్నట్టు, తెలంగాణవాదం పలుచబడుతున్నట్టు, వాళ్ల చిరతలు వాళ్లే వాయించుకుని తెగ ప్రచారాలు చేసుకుంటున్నారు జగన్ పార్టీవోళ్లు. సీమాంధ్ర పత్రికలు కూడా ఏదేదో జరిగిపోతున్నట్టు బిల్డప్ లు బాగానే ఇస్తున్నాయి.

ఇంతకీ ఈ పార్టీలో చేరుతున్నదెవరు? ఎందుకు చేరుతున్నారు? వాళ్ల సీనెంత???

సరే గోనెలు గానెలు చెప్పనవసరం లేదు. వాళ్లకు ఆ పార్టీయే టిక్కెట్టివ్వదు..

ఇక సురేఖమ్మ సీనెంతో గత ఎన్నికల్లోనే తేలిపోయింది. ముక్కు చీదినా… శోకాలు పెట్టినా…వచ్చే ఎన్నిక నందోరాజా భవిష్యతి…. ఎవరూ చెప్పలేరు. ఈ రెండేళ్ల కాలం భిక్షపతి వాడుకునే విధానంపై అటు తెలంగాణపై జగన్ పార్టీ విధానంపై ఆధారపడుతుంది.

రహెమాన్ భవితవ్యం….చనిపోయిన రాజేశ్వర్ రెడ్డి భార్య పార్టీలో చేరుతుందా….లేక కాంగ్రెస్ లోనే ఉంటుందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రుద్రమను పార్టీ వాళ్లు నమ్ముతున్నారా లేదా ఇంకా తెలియదు. ఆది శ్రీనివాస్ ఇప్పటికి రెండుసార్లు దండయాత్ర చేసి చతికిల పడ్డాడు. చెన్నమనేనిని టీఆర్ఎస్ మారిస్తే ఈ సారి ఇల్లు అమ్ముకోవాల్సిందే…. బాజిరెడ్డి సీటు ఏదో ఇంకా డిసైడే కాలేదు… సంతోష్ కొడుకును పక్కన పెడతారా…బాన్సువాడకే వెళ్లమంటారా తెలీదు..

ఇక ఇటీవలే చేరింది… నల్లగొండలో సంకినేని వెంకటేశ్వర రావు.

నిజానికి సంకినేని టీఆర్ఎస్ కు గత ఆర్నెళ్లుగా లైనేసిన వాడు. టిక్కెట్టిస్తే పార్టీలో చేరతానని కేసీఆర్ గడ్డం పట్టకుకుని బతిమాలినా ఆయన ఒప్పుకోలేదు. ఆ సీటు జగదీశ్వర్ రెడ్డికి అనుకున్నానని…పార్టీ పుట్టినప్పటినుంచి నమ్ముకున్న అతన్ని మోసం చేసే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చిన తర్వాతే రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. ఇది జర్నలిస్టులందరికీ తెలుసు.. కానీ పత్రికల్లో రాయరు.

ఇక జలగం వెంకట్ రావు, వడ్డేపల్లి నర్సింగ రావుల సంగతి చూస్తే -వెంకట్ తండ్రి జలగం వెంగళరావు రాజకీయదురంధరుడే. కానీ ఆయన కుటుంబం తమ జీవితంలో ఏనాడూ సరైన నిర్ణయంతీసుకున్న దాఖలాలు లేవు. చెత్త నిర్ణయాలు తీసుకోవడం ఆనక బాధపడటం వాళ్లకు అలవాటే. వడ్డేపల్లి నర్సింగ రావు – గాలి బాగా ఉన్న గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ నుండి పోటీ చేసి బేరుమన్న ఆయన ఇపుడు కొత్తగా చేసేదేమిటి? కూకట్ పల్లి లాంటి పక్కా కమ్మ ప్రాంతంలో చేయగలిగేది అదీ రెడ్డి పార్టీ టికెట్టుతో…

కోమటి రెడ్లు…రాజగోపాల్ రెడ్లు… జగన్ వ్యాపారాల్లో నిద్రించే భాగస్వాములని చెబుతారు.వాళ్ల బాధ వాళ్లది…

కొత్తగా ఆదిలాబాద్ నుంచి కోనప్ప చేరాడు. ఆయన ఎలాగూ సెటిలరే. ఇప్పటికి డజనుసార్లు అనేక టిక్కట్లపై పోటీకి దిగినా గెలిచింది మాత్రం ఒకే ఒక్కసారి. అదీ టీఆర్ఎస్ మద్దతు ఉన్న సమయంలో. తెలంగాణ ఫీలింగ్ బలంగా ఉన్నఈ సమయంలో ఆయనకు టిక్కెట్టిచ్చినా అక్కడున్న పదివేల సెటిలర్ల ఓట్లు తప్ప తెలంగాణ ఓట్లు వచ్చే ప్రసక్తే లేదు. మరోవైపు ఇంద్రకరణ్ అవుట్ డేటెడ్ పాలిటీషియన్ గత ఎన్నికల్లో తెలంగాణలోఎక్కడా పెద్దగా గెలవని ప్రజారాజ్యం తరపున నిలబడిన కొత్త అభ్యర్థి చేతిలో బేరుమన్న ఇంద్ర ఇప్పుడు మాత్రం ఊడబొడిచేదేంది? గతంలో అంటే జిల్లా సారా సామ్రాజ్యమంతా గుప్పిట్లో ఉండడంతో డబ్బులు కుమ్మరించి గెలిచాడు. ఇపుడు ఆ సామ్రాజ్యం మొత్తం ఆయన ప్రత్యర్థి ప్రేమ్ సాగర్ రావు గుప్పిట్లోకి వెళ్లి రోజువారీ ఖర్చులకే కటకటలాడే పరిస్థితి ఉంది. అది ఆ మధ్య తనది కానీ కాగజ్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీచేసినపుడు బయటపడింది. కాంగ్రేసోళ్లే వద్దు పొమ్మంటున్నారంటే పరిస్థితి ఊహించవచ్చు.

నిజానికి ఇప్పుడున్నచాలామంది కాంగ్రెస్, టీడిపీ నాయకులు పార్టీ, వేవ్, అధినాయకుల గ్లామర్ అడ్డు పెట్టుకుని గెలిచేవారే తప్ప సొంత బలంగా గెలిచే సీను ఉన్నవాడు లేడు. అందుకే వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెస్సార్ బాల్చీ తన్నేసిన సందర్భాలున్నాయి.

ఉప్పనూతల, గోవర్ధన్ రెడ్డి, ఇంద్రకరణ్, మండవ, జైపాల్, మల్లికార్జున్, జలగం…. లాంటి మహామహులు కూడా ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.

టీఆర్ఎస్ లో టిక్కెట్ ఆశ లేక, ఉన్నపార్టీలో డిపాజిట్ ఆశ లేక దేవుడి మీద భారం వేసి చేరుతున్న ఎల్లాయిలు పుల్లాయిలతో ఏదో అయిపోతుందని, ఆందోళన అనవసరం.ఎలా అయితే అలా కానీ, ఖర్చు జగన్ పెట్టుకుంటాడు అనుకుని కొందరు ఆ మేరకు హామీ పొంది కొందరు అటు దూకుతుంటే కంగారెందుకంటా?

చుట్టూ చేరి మేమూ తెలంగాణ తెస్తున్నాం…ఇస్తున్నాం…అంటే వినే కన్ఫ్యూజన్ ఉండదు… తెలంగాణ శత్రువులు క్లియర్ గా కనిపిస్తారు. ఒకందుకు ఇదీ మనమంచికే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *