mt_logo

కలిసి నడవాల్సిన సమయం..

[నవంబర్ 6 నాడు నమస్తే తెలంగాణలో ప్రముఖ మార్క్సిస్టు వ్యాఖ్యాత, నిజాన్ని కుండబద్దలు కొట్టేట్టు రాసే కాలమిస్టు డాక్టర్ ఏ.పి. విఠల్ గారు రాసిన ఈ చక్కని వ్యాసం చదవండి.  సీమాంధ్రకు చెందినవాడైనా తెలంగాణ అంశంపట్ల ఎంత క్లారిటీ ఉందో చూడండి.]

ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ నిజాం నవాబును ప్రస్తుతించడంపై టీవీ ఛానళ్లలో విశ్లేషణలు విశేషంగా చూశాము. నిజానికి ఇదేమీ పునః సమీక్షకు అవసరమైనంతటి నూతనమైన, ప్రధానమైన అంశం కాదు. గతంలోనూ కేసీఆర్ అలా ప్రస్తావించారు. దానిపై ఖండనలు, మండనలు జరిగాయి. సరే పాపం! ఇక పార్టీల ప్రతినిధులు విశ్లేషణలలో పాల్గొంటే తొండైనా, మొండైనా, తండమైనా వితండమైనా ఆయా పార్టీల దృక్పథాన్నే ప్రతిబింబించాల్సిందే కదా! అలాగే విశ్లేషించేందుకు సైతం అందుబాటులో కొందరు ఆస్థాన విశ్లేషకులు ఉంటారు. వారిలో కొందరు కాస్తో కూస్తో విషయంపై వెలుగు ప్రసారిస్తే, మరికొందరు శబ్దం, మరింత శబ్దం చేస్తూ ఉంటారు. కనుక వాటి సంగతి అటుంచి కేసీఆర్ నిజాం నవాబు పాలనపై చేసిన ప్రశంశాత్మక అంశాలను పరిశీలిద్దాం.

‘నిజాం ప్రభువు నిజాంసాగర్ డ్యాం కట్టించి లక్షల ఎకరాలకు నీళ్లు మళ్లించి, వ్యవసాయదారులకు ఎంతో మేలు చేశాడు. అలాగే ఉస్మానియా ఆస్పత్రి వంటి అధునాతన వైద్యశాలలు నిర్మించి ప్రజలకు వైద్యం అందించాడు. నేడున్న హైకో ర్టు, అసెంబ్లీ ఇత్యాది గొప్ప భవనాలను నిర్మించాడు. మంచి రహదారులను నిర్మించాడు. తద్వారా హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. ఎంతగా అంటే దేశంలోనే ఐదవ గొప్ప నగరంగా! ఇదీ స్థూలంగా కేసీఆర్ ప్రసంగం. ఇందులో అసత్యం ఏమైనా ఉన్నదా? లేదు.అయితే ‘అర్థ సత్యమే’ ఇది. ఇంకా చెప్పాలంటే నిజాం నిరంకుశ ప్రభువులు చేసిన అకృత్యాలు, ప్రత్యేకించి వీర తెలంగాణ విప్లవ పోరాటాన్ని అణచివేయాలని వందలాది రైతాంగాన్ని బలిగొన్నాడు. (నెహ్రూ సైన్యాలు అంతకంటే ఎక్కువమందిని బలిగొన్నాయి) తన విలాసాల కోసం కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. ఇది కేసీఆర్ నిజాం ప్రభువుపై చేసిన వ్యాఖ్యల సందర్భంగా ఆయనను ‘దోషి’గా నిందించేవారి ప్రధాన వాదన. వాదన కోసం ఈ విశ్లేషణలు కూడా నిజాం నవాబులోని చెడు పార్వ్శాన్ని చూపి, మంచి పార్శ్వాన్ని మరుగునపరిచి, అర్థ సత్యం చెప్పినట్లే కదా! పోనీ కేసీఆర్ చెప్పిన పార్శ్వం చాలా తక్కువ స్థాయిగా ఈ విశ్లేషకులు భావించినా అది అబద్ధం అని అనజాలము కదా! ‘నిజాం పాలనలో మీరు (తెలంగాణ ప్రజలు) విద్యా, వైద్య సౌకర్యాలు లేక వ్యవసాయం చేయరాక, చేయదలచినా వసతులు లేక విజ్ఞానానికి దూరంగా, నీ బాంచన్ దొర అంటూ అనాగరికంగా కునారిల్లారు. మేము వచ్చి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం. మేము వచ్చి మీకు వ్యవసాయం నేర్పి, వైద్యశాలలు, రహదార్లు ఇత్యాదివి కల్పించాము. అని తమ వల్లనే వారి నాగరికపు పొద్దు మొలిపించినట్టు సీమాంధ్రులు గొప్పలు చెప్తున్నారు. హైదరాబాద్ నగరం తమదేననో ఉమ్మడిదనో, తెలంగాణ వారిది మాత్రం కాదనో సీమాంధ్రులు వాదిస్తున్న సందర్భంగా కేసీఆర్ అన్నమాట.

నిజాం ఒక ఫ్యూడల్ రాచరిక వ్యవస్థకు ప్రతినిధి! ఆ మాటకొస్తే మన పిల్లల పాఠ్యపుస్తకాలలో మనం ప్రస్తుతించే అశోకుడు, శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ ప్రాంతంలోని ‘కాకతీయ కళా వైభవమ్ము’ అంటూ కీర్తించే రాణిరువూదమ వీరందరూ ఫ్యూడల్ రాచరిక వ్యవస్థ ప్రతినిధులే. వీరి రాజ్యాలలో ప్రధానంగా సాగింది భూస్వామ్య పాలన అంటే రైతాంగంపై, ప్రజలపై నిరంకుశ దోపిడీ, అణచివేత దుర్మార్గాలు సాగాయి! వీరి పాలనలో కనీసం అష్టవంకరులతో భ్రష్టుపడుతున్న నేటి ప్రజాస్వామ్యమైనా లేదు. చట్టమూ లేదు. ఇక చట్టబద్ధ పాలన ఎక్కడది ఆ రాచరిక పాలనలో. పైపై మెరుగులుగా మంచి కనపడినా, మౌలికంగా అదే క్రూరమైన పాలనే. అయినా ఆ రాజులలో లేదా చక్రవర్తులలో కొందరు కొన్ని ప్రజాహిత కార్యక్షికమాలు చేయకపోలేదు. ఎన్నో యుద్ధాలు చేసి, వేలాదిమందిని బలిగొన్న ‘అశోకునికి కళింగ యుద్ధానంతరం జ్ఞానోదమయి, బౌద్ధమతాన్ని స్వీకరించి, శాంతికాముకుడైనాడు. ఆయన చేసిన మంచి పనులను ప్రస్తుతిస్తూ పుస్తకాలు రాసినవారు, ప్రచురించిన వారు వాటిని పాఠ్యాంశాలుగా నిర్ణయించిన పాలకులు వాటిని బోధించే ఉపాధ్యాయులూ వీరందరిని ఏమనాలి? అలాగే కాకతీయ ప్రభువులు వారిలోని రాణిరుద్రమ. వారి పాలనా అంతే. రామప్ప చెరువు తవ్వించినా, వేయి స్తంభాల గుడి కట్టించినా, సామాన్య ప్రజానీకంపై, రైతులపై నిరంకుశ దోపిడీ పాలనే ఇది చారిత్రక సత్యం. అదే సమయంలో నేటికీ తెలంగాణ ప్రజానీకం, అత్యంత ఉత్సాహంగా ఆట పాటలతో సమ్మక్క-సారక్క జాతరలు జరుపుకుంటారు.

ఎవరీ సమ్మక్క సారక్కలు? ఆ కాకతీయుల పాలననెదిరించి, కత్తి పట్టుకు పోరాడిన యోధులు! ఎందుకు, ఆరాచక వ్యవస్థ దుర్మార్గాన్ని ఎత్తి చూపడంలేదు అంటే అశోకులు, కృష్ణదేవరాయలు, కాకతి రుద్రమ్మలు వారి పాలన ముగిసి చాలా కాలమైంది. నాటి రాచరిక పాలన దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని అనుభవించిన తరం, తర్వాత తరం పూర్తిగా అంతరించింది. కానీ వారు చేసిన కళా పోషణ, ప్రజాహిత కార్యక్షికమాలు మిగిలిపోయాయి. వారిని గానంచేసే వారున్నారు. నిజాం ప్రభువు పాలన అంత పురాతనమైనది కాదు. ఇటీవలనే అనిపించేటట్టు ఆయన పాలన అనుభవించిన తరం మిగిలినా, ఆ తర్వాత తరం మిగిలే ఉన్నది. ఆ దుర్మార్గ నిరంకశత్వం నిన్నటి మాటగా గుర్తుంది. అదే సమయంలో, నిజాంసాగర్ డ్యాం, ఉస్మానియా ఆస్పత్రి తదితర ఆస్పవూతులు హైదరాబాద్ నగరంలోని అసెంబ్లీ, హైకోర్టు ఇత్యాది భవనాలు ప్రజలకు జ్ఞాపకం ఉన్నాయి. బహుశా ఇంకో రెండు మూడు శతాబ్దాలుగా గడిస్తే నిజాం నవాబు కూడా అశోకుడు, కృష్ణదేవరాయలు, కాకతీయ పాలకుల సరసన జనం చేర్చినా చేర్చవచ్చు.

కేసీఆర్ ప్రతినిధి. ఆయన పార్లమెంటు సభ్యులు. సాధారణ ప్రజల వలే ఆలోచించడం వారి వలే మాట్లాడడం, వారిలో ఒకనిగా నిలువగలడం వంటివి ఆయన అనుకూలాంశాలు కూడా. కనుకనే నిజాం నవాబు ప్రజాహిత కార్యక్షికమాలను ప్రస్తుతించాడు. అదే రాచరిక వ్యవస్థపై గురిపెట్టి వీరోచితంగా పోరాడిన కొమురంభీంను అంతకంటే ఎక్కువగానే ప్రశంసించారు. ఒక్క కొమురం భీం విగ్రహం ట్యాంకుబండ్ మీద ఉన్నట్లయితే అక్కడ విగ్రహ విధ్వంసం జరిగి ఉండేది కాదని కొమురం భీం ప్రత్యేకత ప్రస్తావించారు. కనుక కేసీఆర్‌ను నిజాం పాలనను కీర్తించిన వ్యక్తి అనలేము. దానికి వ్యతిరేకంగా పోరాడిన వారిని సైతం అంతకంటే అదనంగా కీర్తించారు. మీరు ఇంత వాదిస్తున్నారు గానీ.. కేసీఆర్ ఏవర్గానికి చెందినవారు? భూస్వామ్య వర్గానికి చెందినవాడు అవునా? కాదా? సాయుధ తెలంగాణ పోరాటంలో ప్రముఖులైన రావినారాయణరెడ్డి, భీమ్‌డ్డి నర్సింహారెడ్డి, జన్మతః భూస్వాములు. కానీ ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. అదీ గమనించాలి.

కేసీఆర్ తన కుటుంబ సభ్యులనే రాజకీయ రంగంలో ముందుకు తెస్తున్నాడని నిదర్శనంగా చూపి ‘వారసత్వ రాజకీయాలు’ అని తమ వాదనా పటిమను ప్రదర్శించగలరు. అయ్యా నేటికీ మనదేశంలో భూస్వామ్య వ్యవస్థ నిలి చే ఉన్నది. సాంస్కృతికంగా అయితేనేటికీ ఆ భూస్వామ్య ఆలోచనా ధోరణి అధికంగానే ఉన్నది. అందులో భాగమే వారసత్వం. ఇంతెందుకు సీమాం ధ్ర ప్రాంతం బాగా అభివృద్ధిచెందిన ప్రాంతం -తెలంగాణ వెనుకబడిన అనాగరిక ప్రాంతం కాదుమరి! దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌డ్డి తనయుడు జగన్‌మోహన్‌డ్డి వివిధ జిల్లాల్లో ఓదార్పు యాత్ర కొన్ని నెలలపాటు పల్లెపల్లెకూ తిరుగుతూ సాగిస్తున్నారు. ఆయన యాత్రకు ప్రజా స్పందన అపూర్వం! అదంతా డబ్బులిచ్చి తెచ్చిన జనం అని పాపం, కాంగ్రెస్, టీడీపీ వర్గాలు ఎంతమొత్తుకున్నా అదే కారణమనగలిగిన స్థితిలేదు.

కాంగ్రెస్, టీడీపీ వారిలా ఎప్పటికప్పుడు మాట మారుస్తూ, రంగులు మార్చే ఊసర వెల్లి కాదని ప్రజల అభిప్రాయం. అయినా నెహ్రూ, ఇందిర, రాజీవ్ ,సోనియా , రాహుల్‌గాంధీ వారి అత్యున్నత నాయకత్వం కదా? ఈ అంశం మందుకు తెచ్చి తద్వారా తమ దిగజారుతున్న రాజకీయ పలుకుబడిని నిలబెట్టుకుందామని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.

అయ్యా! ఎన్‌టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో లేటుగా జేరి అదే టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి, ఓడిపోయి, మామ కదా ఆదరించండి అంటూ చేరినదెవరు? ఇటీవల జరిగిన తెలుగుదేశం మహానాడు ప్రాంగణంలో నూ, చుట్టుపక్కల లోకేష్ ఫోటోలతో ఫ్లెక్సీలు విపరీతంగా కానవచ్చినవట. ఆ లోకేష్ ఎవరు? అసలు ఆ లోకేష్ ఫ్లెక్సీ ల పట్ల కినుక వహించింది ఎవరు? హరికృష్ణ. అదిసరే.. ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అందుకు కారణంగా ఎవర్ని చూపుతారు? శ్రీమతి లక్ష్మి పార్వతిని. కాంగ్రెస్‌లో ఎదుగుతున్న నాయకురాలు పురందేశ్వరి ఎవరు? ఇదంతా ఎందుకు? నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో అది జనరల్ నియోజకవర్గంగా ఉన్న చివరిసారి తప్ప అన్ని పర్యాయాలు భీమ్‌రెడ్డి నర్సింహారెడ్డి, అయన సొదరి మల్లు స్వరాజ్యం, ఆమె భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి వీరంతా సీపీఎం తరఫున (తెలుగుదేశం తరఫున పోటీచేసిన కుశలవరెడ్డి బీఎన్ సోదరుడే) అభ్యర్థులుగా పోటీచేశారు. ఈ కుటుంబమేనా? ఇంకెవరూ వేరే వారు పనికి రారా? అని కాంగ్రెస్ వారు హేళన చేసే వారు. అప్పుడు నేను చెప్పేవాడిని, 1946లో వారందరూ వీర తెలంగాణ విప్లవ పోరాటంలో ప్రాణాలకు తెగించి దుమికినప్పుడు, మీరేనా పోరాడేది. ప్రజాపోరాటంలో ముందుండేది? అని ఈ కాంగ్రెస్‌లో ఉన్నవావరైనా అడిగారా? వీరిలో అనర్హుడెవరో చెప్పండి? అని బహిరంగంగా ప్రజలలోనే ప్రశ్నించే వాడిని.

అలాగే ప్రత్యేక తెలంగాణ సాధన కొరకు ప్రజా పోరాటంలో హరీష్‌రావు, కేటీఆర్, కవిత అనర్హులా చెప్పండి? అనర్హులను కేసీఆర్ ప్రోత్సహిస్తే స్వార్థం. అంతేగానీ తెరాస, కేసీఆర్‌లతో పోటీ పడలేక చచ్చు పుచ్చు వాదనలతో కాలక్షేపం వద్దు. తెరాసలో, కేసీఆర్‌లో అసలు తప్పులు లేవని కాదు. కానీ నేడు తెలంగాణ ఉద్యమానికి పర్యాయపదంగా మారింది తెరాస. దాని నేతనే కేసీఆర్. ఇది కఠోర వాస్తవం. తెలంగాణ వ్యతిరేక సీమాంధ్ర నాయకుల్ని విడిచిపెట్టి ధైర్యంగా తెలంగాణ సాధించేందుకు సిద్ధపడండి! కువిమర్శలు మానండి!

-డాక్టర్ ఏపీ విఠల్
98480 69720

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *