mt_logo

టీఆర్ఎస్ లో సైనికుల్లా పనిచేస్తాం-కొండా సురేఖ

వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు కొండా సురేఖ, ఆమె భర్త మురళి మంగళవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ, తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ వల్లే జరుగుతుందని భావించి తాము టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు, అధికారం, పదవికోసం కాకుండా బంగారు తెలంగాణను ఏర్పాటు చేయడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణపై కేంద్రప్రభుత్వం వెనక్కిపోయినా కేసీఆర్ పట్టువీడకుండా తెలంగాణ సాధించి చూపించారని అన్నారు. ఆయన దారిలో నడిస్తే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని, ఆయన ధైర్యాన్ని చూసి డిల్లీ పీఠం కదిలి తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తే మరో వందేళ్ళయినా ఇప్పుడున్నట్లుగానే తెలంగాణ ఉండేదని, ఎక్కువ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రాన్ని నిలదీసే శక్తి కేసీఆర్ కు ఉంటుందని, తెలంగాణకు అన్యాయం జరగొద్దంటే మెజార్టీ ఎంపీలు టీఆర్ఎస్ కు ఉండాలని అన్నారు. తాము వైసీపీలో ఉన్నప్పుడు జరిగిన మానుకోట ఉదంతం దురదృష్టకరమని, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం కాదని, జగన్ కోసమే అలా చేశామని తెలిపారు. గతంలో కేసీఆర్ పై తాను చేసిన విమర్శలను వెనక్కు తీసుకుంటున్నట్లు, కేసీఆర్ ను గతంలో అపార్థం చేసుకున్నానని, తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచింది కేసీఆర్ మాత్రమే అని వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేయాలని కేసీఆర్ సూచించగా దానికి ఆమె ఒప్పుకున్నారని తెలిసింది. వీరితోపాటు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు జగదీశ్వర్ రెడ్డి, కోదండరాం రెడ్డి, బుచ్చిరెడ్డి, సర్దార్ ఖాన్ తదితరులు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేసీఆర్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *