‘రాబోయే రోజుల్లో జన తెలంగాణ తయారు చేసుకుని సమానంగా బతుకుదాం. కొత్త రాష్ట్రం, కొత్త నాయకులు, కొత్త పాలన ఉంటుంది. సమానంగా బతికే తెలంగాణ తయారు చేస్తాననే సంపూర్ణ విశ్వాసం నాకుంది.’ అని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో మంగళవారం నాడు స్పష్టం చేశారు. వరంగల్ కాంగ్రెస్ నేతలు కొండా సురేఖ, ఆమె భర్త మురళి, మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు, టీడీపీ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. ‘ఉద్యమం పక్కదారి పడితే రాళ్ళతో కొట్టి చంపమన్నా, తెలంగాణ తెస్తా అన్నా. తెలంగాణ తెచ్చుకున్నాం. అవినీతి రహిత తెలంగాణ కోసం మీరంతా టీఆర్ఎస్ ను బలోపేతం చేయాల’ని తెలంగాణ ప్రజానీకాన్ని కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఏముందో టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు తెలిసినంతగా ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదని, ఇప్పటివరకు తెలంగాణ ఆత్మను ఆవిష్కరించినట్లుగా ఎవరూ పనిచేయలేదని అన్నారు. తెలంగాణలో సిరులు కురియాలని, ప్రతి ఒక్కరికీ 2 లక్షల 75 వేల కోట్ల ప్రణాళికతో అన్ని వసతులతో కూడిన పక్కా ఇళ్ళు కట్టించి ఇస్తామని, రాబోయే తెలంగాణ రాష్ట్రంలో అన్నీ రాష్ట్ర ప్రభుత్వ గురుకుల పాఠశాలలే ఉంటాయని, అందరికీ ఒకే రకమైన విద్య, ఆహారం, యూనిఫాం ఉంటుందని, సీబీఎస్ఈ సిలబస్ లో ఒకే మీడియంతో ఉచిత విద్య కేజీ టు పీజీ వరకు అందిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చిన తెలంగాణ ధనవంతులకోసం, దొరల పెత్తనం కోసం కాదని, మన రాతను మనమే రాసుకోవాలని, ఎమ్మెల్యే, ఎంపీ రెండు ఓట్లూ టీఆర్ఎస్ కే వేసి గెలిపించాలని, ఢిల్లీని శాసించి మనకేం కావాలో మనమే తెచ్చుకుందామని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.