mt_logo

నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతాను: సీఎం కేసీఆర్

ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని, “నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా”నని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని, ఎన్నట నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారమని, ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.

పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదని సీఎం మరోమారు పునరుద్ఘాటించారు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నామని, అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతామని సీఎం స్పష్టం చేశారు. పట్టుబడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకతని సీఎం అన్నారు.

కరీంనగర్ కలెక్టరేట్ లో శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ‘తెలంగాణ దళితబంధు అమలుతీరుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, సీఎంఓ కార్యదర్శులు స్మితా సభర్వాల్, రాహుల్ బొజ్జా, కరీంనగర్ కలెక్టర్ కర్ణన్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ రవీంద్రసింగ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, నాయకులు కౌశిక్ రెడ్డి, పెద్ది రెడ్డి, బ్యాంకర్లు, సంక్షేమ శాఖ అధికారులు, రాష్ట్ర, జిల్లా దళిత సంఘాల నేతలు మేడి మహేష్, కంసాల శ్రీనివాస్, బొగ్గుల మల్లేశం, దుంపల జీవన్, గోసుకంటి అరుణ్, నల్లా కనకరాజు, రాష్ట్ర స్థాయి దళిత బంధు రిసోర్స్ పర్సన్స్, తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ…….

“ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నం. సాగు నీటి రంగాన్ని పునరుజ్జీవనం చేసుకున్నాం. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసుకున్నాం. కరెంటు ను నిరంతరాయంగా ఇచ్చుకుంటున్నాం. ఒకనాడు కూలీ పనికి పోయిన రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించుకుంటున్నాం. రాష్ట్రం వచ్చిన నాడు అర్థంకాని పరిస్థితుల నుంచి అర్థవంతమైన, గుణాత్మకాభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులేస్తున్నది. ఆకలి చావుల నుంచి అన్నపూర్ణగా ఎదిగింది రాష్ట్రం. కునారిల్లుతున్న కులవృత్తులను కోట్లాది రూపాయలు వెచ్చించి ఆర్థికంగా నిలబెట్టుకున్నం. గొర్రెల పెంపకం, చేపల పెంపకం, చేనేతకు ఆసరా, ఎంబీసీలకు అండగా నిలబడి ది ప్రభుత్వం. అన్ని రంగాల ను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలను అండదండలు అందిస్తూ గత ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం నేనున్నాననే ధీమాను స్ఫూర్తిని అందిస్తున్న ది.

రైతుబంధు, రైతు బీమాతో రైతులకు వ్యవసాయానికి ఉపశమనాన్ని కలిగించినం. గత వలసపాలనలో అన్ని రంగాల్లో గాడితప్పిన తెలంగాణ నేడు ఒక దరికి చేరుకున్నది. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు పెన్షన్ అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. కళ్యాణలక్ష్మి, కేసిఆర్ కిట్, అమ్మఒడి వాహనాలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నాము. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలను సరిదిద్దుకుంటూ, సవరించుకుంటూ ఒక దరికి చేరుకున్నాం.

నేను ఎప్పటినుంచో అనుకుంటున్న దళిత అభివృధ్ది కార్యచరణకు ఇప్పుడు సమయం వచ్చింది. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా వున్నప్పుడు సిద్ధిపేటలో దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని చేపట్టి దళిత జాతి అభ్యున్నతి కోసం కృషి చేసిన. దళితబంధు గత సంవత్సర మే ప్రారంభమయ్యేది ఉండే, కానీ కరోనా కారణం చేత ఆలస్యమైంది.

ఇప్పుడు దళితబంధు మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాం. భారతదేశవ్యాప్తంగా దళితుల పరిస్థితి దారుణంగా ఉంది. ఉత్తర భారతదేశంలో దళితుల పరిస్థితిని చూస్తే, మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరు చలించిపోక తప్పదు. ఇకనైనా ఈ దేశంలో దళితుల పట్ల ఆర్థిక, సామాజిక వివక్ష పోవాలె. వారి కోసం కంకణబద్ధులై పనిచేసే ప్రభుత్వాలే నేటి అవసరం. తెలంగాణ ప్రభుత్వం హుజురాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలుపరుస్తున్న దళితబంధు కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో, తప్పకుండా విజయవంతం చేస్తాం. తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశానికే పాఠం నేర్పే విధంగా దళిత బంధును నిలబెడదాం.” అని సిఎం కెసిఆర్ అన్నారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ పోరాటం మొదలుపెట్టక ముందే “సబాల్ట్రన్ స్టడీస్ సెంటర్ ఏర్పాటు చేసి దళితుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల పట్ల అధ్యయనం చేశాం. ప్రపంచ వ్యాప్తంగా 165 జాతులు ఆర్థిక, సామాజిక వివక్షకు గురౌతున్నయనే విషయాన్ని అధ్యయనం ద్వారా తెలుసుకున్నాం. భారతదేశ దళితుల పరిస్థితి కూడా ఈ 165 జాతుల మాదిరిగానే ఉందనే విషయాన్ని నిర్ధారణ అయ్యింది. దళితులకు ఆస్తులు లేవు, పై నుంచి సామాజిక వివక్ష, వారిలో వజ్రాలు ఉన్నాయి, కాని అవకాశాలు రావాలి. ఇప్పుడు ఆ అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఇది చిల్లర మల్లర ఓట్ల కొసం చేపట్టిన కార్యక్రమం కాదు, ఆదరబాదర అవసరం లేదు, ప్రతి దళితుల కుటుంబాన్ని పేరు పేరున అభివృద్ధిపరిచే దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సమగ్ర కుటుంబ సర్వే లో రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని తేలింది, దాదాపు 75 లక్షల దళిత జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉంది, అంటే తెలంగాణ జనాభాలో 18 శాతం దళితులు ఉన్నారు. దళిత జనాభా పెరుగుతున్నది. దాని తగ్గట్లు రాబోయే కాలంలో వారి రిజర్వేషన్ల శాతం పెంచుకునే ప్రయత్నం చేద్దాం.” అని సిఎం అన్నారు.

“తెలంగాణ కోసం నేను కదిలిన నాడు నా వెంట మీరంతా కదిలిండ్రు, తెలంగాణను సాధించుకునే దాకా నా వెంట నడిచిండ్రు, నేను కోట్లాడితే నాకు సహకరించిండ్రు. గత ఏడు యెండ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమానికి అండగా నిలబడుతున్నారు. తెలంగాణ పోరాటంలో మీ సహకారం నిజమైనదైతే తెలంగాణ దళితుల అభివృద్ధి కోసం అదే ఉద్యమ స్ఫూర్తితో నేను చేస్తున్న పోరాటానికి కూడా నాకు సహకారం అందించాలే” అని తెలంగాణ సమాజానికి సి.ఎం. కెసిఆర్ పిలుపునిచ్చారు.

రైతు బంధు తదితర సహయ, సహకారాలు అందించి ఎట్లైతే వివక్షకు గురైన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని పట్టుబట్టి అభివృద్ధి పరుచుకున్నామో, వివక్షకు గురౌతున్న తెలంగాణ దళిత జాతిని అభివృద్ధి చేసుకోవడంలో కూడా అదే సిద్ధాంతం ఇమిడి ఉన్నదని సిఎం అన్నారు. రైతు బంధు ఆర్థిక సాయాన్ని ఉద్యోగస్తులు, వారు, వీరు అనే తేడా లేకుండా ఎట్లైతే పరిమితులు లేకుండా అందిస్తున్నామో, అదే పద్ధతిలో దళిత బంధుకు కూడా పరిమితులు లేవన్నారు. దళిత బస్తీలోని దరిద్రాన్ని బద్దలుకొట్టాలంటే ఉద్యోగస్తులకు కూడా దళిత బంధు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎస్సీ వర్గాల్లోని అన్ని ఉప కులాలకు దళిత బంధు వర్తిస్తుందని తెలిపారు. దండుగన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చడానికి, ఉజ్వలంగా వెలుగొందాలని ఎట్లైతే ప్రభుత్వం ఆర్థికంగా ఊతం ఇచ్చిందో అదే పద్ధతిలో నిరాశ నిస్పృహలకు గురైన దళిత జాతి సముద్దరణకు కూడా ఆర్థికంగా అండదండలు అందితేనే వారు తలెత్తుకొని సమాజంలో తిరుగుతూ గుణాత్మక జీవనాన్ని కొనసాగిస్తారనే, దార్శనికతతో తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు.

హుజురాబాద్ నుంచి ప్రారంభమయ్యే దళిత చైతన్య జ్యోతి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి దేశానికే వెలుగులు పంచనున్నదని, అణగారిన దళిత వర్గాల్లో చైతన్యాన్ని తీసుకువస్తుందన్నారు. ఎట్లైతే స్పష్టమైన అవగాహనతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి గమ్యాన్ని ముద్దాడామో అంతే స్పష్టమైన అవగాహనతో దళిత బంధు ఉద్యమాన్ని నడిపించి, గమ్యాన్ని ముద్దాడుతాం” అని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

సాగునీటి రంగం, వ్యవసాయ రంగానికి ఎట్లైతే లక్షలాది కోట్ల రూపాయలను ఖర్చు చేసి పునరుజ్జీవనం చేసుకున్నామని, అదే పద్ధతిలో లక్ష డబ్బై ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి యావత్తు తెలంగాణ దళిత కుటుంబాలను దశల వారీగా రాబోయో కాలంలో అభివృద్ధి పరుచుకుంటామన్నారు. ప్రతి ఏటా 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ 2 నుంచి 3 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు కార్యక్రమాన్ని దశల వారీగా అమలుపరుస్తామని సిఎం తెలిపారు.

దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు కార్యక్రమాన్ని అన్ని దళిత కుటుంబాలకు చేర్చేందుకు, ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు దళిత మేధావి వర్గం నడుము బిగించాలని సిఎం అన్నారు. “గ్రామాలకు తరలండి, దళిత గూడాలలో ప్రతి కుటుంబాన్ని కలవండి, వారితో మాట్లాడండి, వారికేమీ కావాలో తెలుసుకొండి. ప్రేక్షకపాత్ర వహించవద్దు, మన జాతిని మనమే బాగు చేసుకోవాల”ని దళిత మేధావి వర్గం, యువతకు సిఎం పిలుపునిచ్చారు.

దళిత బంధు పథకం ద్వారా అమలుపరుస్తున్న పలు కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాన్ని వెంట తీసుకొని వెళ్లి అందులో పొందుపర్చిన వివిధ వ్యాపార, ఉపాధి మార్గాలను వివరించలన్నారు. లబ్దిదారులే స్వయంగా వారి పనిని ఎంచుకునేందుకు సహకరించాలని అధికార యంత్రాంగానికి సిఎం స్పష్టం చేశారు. పలాన పనినే చేయాలని గాని పలాన చోటనే చేయాలని గాని నిబంధనలు ఏమీ లేవన్నారు. నచ్చిన, చేయవచ్చిన పని చేసుకొవచ్చన్నారు. అదే సందర్భంలో అందరూ ఒకే పని కాకుండా భిన్నమైన పనులను ఎంచుకోవడం ద్వారా ఆర్థికంగా మరింతగా లబ్ధి పొందవచ్చునన్నారు. ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే ఫర్టిలైజర్, మెడికల్, వైన్స్ తదితర రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కలిపిస్తామన్నారు. హాస్టల్స్, హాస్పిటల్స్ కు విద్యుత్ రంగ సంస్థలకు మెటిరీయల్ సప్లయ్ చేసే అంశంలో, సివిల్ సప్లయ్స్ రంగలో కూడా దళితులకు అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. కాంట్రాక్టర్ రంగంలో కూడా కొంత శాతం రిజర్వేషన్ కోసం ఆలోచన చేస్తామన్నారు.

తెలంగాణ పరిశ్రమల రంగంలో ఇప్పటివరకు 2 లక్షల 20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 15 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాయని, అదే పద్ధతిలో 1.75 లక్షల కోట్ల రూపాయలను దళితులకు పెట్టుబడిగా పెట్టడం ద్వారా అది తిరిగి పునరుత్పాదకతను సాధిస్తుందని, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను దళిత బంధు పథకం అందిస్తుందని సిఎం అన్నారు.

గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దళిత బంధు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సిఎం తెలిపారు. దళిత బంధు కార్యక్రమం అమలుతో పాటు ఒక్కసారి అభివృద్ధి చెందిన కుటుంబం కిందపడకుండా రక్షణ నిధి “ సపోర్టివ్ స్ట్రక్చర్” ను ఏర్పాటు చేశామని, ఇటువంటి విధానం ప్రపంచంలోనే ఒకటి, రెండు చోట్లో ఉంటుందని, దేశంలో ఇదే మొదటిదని సిఎం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దళిత బంధు కమిటీలు ఈ రక్షణ నిధిని పర్యవేక్షణ చేస్తాయని, ఆపద వచ్చిన వారిని ఆదుకొంటూ వారిని తిరిగి నిలబెడతాయని సిఎం తెలిపారు.

హుజురాబాద్ లో దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్ట్ అమలు తీరుతెన్నులపై అధికారులతో చర్చించిన సిఎం కెసిఆర్ పలు సూచనలు చేశారు. మొదటగా ప్రతి కుటుంబాన్ని వారి స్థితిగతులను తెలుసుకొనే విధంగా దళిత కుటుంబ గణన చేయాలన్నారు. చేపట్టిన పనిని ఇష్టంతో సమర్ధవంతంగా నిర్వహించగలిగే పరిస్థితి లబ్దిదారునికి ఉందా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. వారికి తెలువకపోతే అర్ధం చేయించాలని సిఎం తెలిపారు. లబ్ధిదారులకు దళిత బంధు పథకం ఆర్థిక సహాయం అందే విధంగా ప్రత్యేకంగా తెలంగాణ దళిత బంధు బ్యాంకు ఖాతాను తెరిపించాలని, అందుకు బ్యాంకర్ల సహకారం తీసుకోవాలని సిఎం అధికారులకు సూచించారు. దళిత బంధు అకౌంట్ ను ట్యాగ్ చేసుకొని ఆన్ లైన్లో లబ్ధిదారు కుటుంబం చేపట్టిన పని పురోగతిని నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగు సలహాలు, సూచనలు అందిస్తుండాలని సిఎం తెలిపారు.

దళిత కుటుంబాల వద్దకు వెళ్ళినప్పుడు అధికార భాషలో కాకుండా జనం భాషలోనే అర్ధమయ్యే రీతిలో మాట్లాడాలని సూచించారు. ఓపినియన్ మేకర్స్ గా ఫెసిలిటేటర్లుగా ఒక సామాన్య కార్యకర్త లాగా ప్రజలతో వ్యవహరించాలని, వారితో ఇంటిమసి పెంచుకొవాలని సూచించారు. ఉద్యమ స్పూర్తితో పని చేయాలన్నారు. దళిత మేధావులు, విద్యార్థులు అధికారులకు సహకరిస్తారని, అండగా నిలబడుతారని తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలో హైదరాబాద్ లో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుందామన్నారు. దళిత బంధు రాబోయే కాలంలో మహా ఉద్యమంగా మారబోతుందని, హుజురాబాద్ నియోజకవర్గం యావత్ తెలంగాణ కు ట్రైనింగ్ గ్రౌండ్ కాబోతున్నందని సిఎం అన్నారు.

ఎస్సీ వెల్ఫేర్ మంత్రి , బి.సి. వెల్ఫేర్ మంత్రి, కరీంనగర్ జిల్లా వారే కావడం, ఫైనాన్స్ మినిస్టర్ పక్క నియోజకవర్గమమే కావడం హుజురాబాద్ పైలెట్ ప్రాజెక్టు విజయవంతానికి మార్గం మరింత సుగమం అయిందని సిఎం తెలిపారు. పాల ఉత్పత్తి రంగంలో కరీంనగర్ డైయిరీ సక్సెస్ స్టోరీ చూసి తనకెంతో గర్వంగా ఉందని సిఎం సంతోషం వ్యక్తం చేశారు. పాల ఉత్పత్తికి కరీంనగర్ జిల్లాలో అనుకూల వాతావరణం ఉందని, దళిత బంధు పథకంలో భాగంగా ఔత్సాహికుల కోసం డైయిరీ ఫామ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి కరీంనగర్ డైయిరీ యజమానులతో మాట్లాడి పాల సేకరణ విషయంలో సహకారం తీసుకొవాలని, తద్వారా హుజురాబాద్ లో డైయీరి ఫామ్ ఏర్పాటు చేసిన దళిత బంధు లబ్ధిదారులకు ఆర్థికాభివృద్ధి దోహదపడాలని అధికారులకు సిఎం తెలిపారు. అవసరమైతే లక్ష లీటర్ల వరకు పాలను అదనంగా కొనుగోలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ డైయిరీ యజమాని ప్రకటించడంతో సిఎం సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న దళిత సంఘాల నేతలు, మేధావులు, సీనియర్ రాజకీయ నాయకులతో సిఎం చర్చించారు. వారిచ్చిన సూచనలను నోట్ చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కాగా సిఎం కెసిఆర్ చేపట్టిన దళిత బంధు కార్యక్రమం కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా దళితుల సాధికారతను, సామాజిక వివక్ష నుంచి దూరం చేసి దళిత ఆత్మగౌరవాన్ని అత్యున్నత స్థాయిలో నిలుపనున్నదని, వక్తలు అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ నాడు రాజ్యాంగ రచన కోసం చేసిన మేధో మథనం వంటి శ్రమ, దళిత బంధు రూపకల్పన, అమలు కోసం సిఎం కెసిఆర్ చేస్తున్నారని సమావేశంలో పాల్గొన్న దళిత సంఘాల నేతలు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *