mt_logo

సీమాంధ్రలో బీసీలకు సీఎం పదవి ఇవ్వొచ్చుగా – హరీష్ రావు?

మహబూబ్ నగర్ కు చెందిన టీడీపీ నేతలు పలువురు సోమవారం తెలంగాణ భవన్ లో హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణలో బీసీ వ్యక్తికే సీఎం పదవి అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల చెవిలో పువ్వు పెట్టేలా మాట్లాడుతున్నాడని, సీమాంధ్రలో సమన్యాయమని ఎందుకు మాట్లాడటం లేదని, ఆ ఇచ్చే సీఎం పదవేదో సీమాంధ్ర బీసీ వ్యక్తికి ఇస్తే సరిపోద్ది కదా అని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు గల్లంతవుతాయనే ఉద్దేశంతోనే ఇప్పుడిలా బీసీ, దళిత సీఎం పదవులంటూ రెండు పార్టీల నేతలూ డ్రామాలాడుతున్నారని అన్నారు. తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని, తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా తెలంగాణ సాధించి చూపించారని, తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని గిరిజనులను ముంచేందుకే ఏడు మండలాలను ఆంధ్రలో కలిపారని, పోలవరం ప్రాజెక్టు డిజైన్ ను మార్చాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. నిన్నమొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయలేదని, దళితులకు ఏమీ చేయకుండా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇప్పుడు దళిత సీఎం డ్రామా ఆడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ మందా జగన్నాథం, నాగర్ కర్నూల్ ఇన్చార్జి మర్రి జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *