-ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తున్న 3 నిమిషాల వీడియో
-ఇప్పటికే 20 లక్షల మందికిపైగా వీక్షణం
-ప్రకృతి అందాలు, చరిత్ర, కళలు, బతుకమ్మపై వీడియో
తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన అద్భుతమైన, అందమైన ప్రోమో చూడండి- ఐటీ శాఖామంత్రి కేటీఆర్.
తెలంగాణ ప్రభుత్వం తయారుచేసిన వీడియో పర్యాటక రంగాన్ని ప్రభావితం చేస్తుంది.
వెల్‌కమ్ టు తెలంగాణ పేరిట ఉన్న వీడియో అద్భుతంగా ఉంది..- యూకే నుంచి వెలువడే ప్రఖ్యాత ట్రావెల్ మేగజైన్.
నేను భారతదేశాన్ని సందర్శించాలనుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణలోని ప్రకృతి రమణీయతను వీక్షించాలని ఉంది- చిలీ పర్యాటకుడు.
నేను చూసిన మంచి వీడియోల్లో ఇదొకటి- ఇసబెల్లా(పర్యాటకురాలు)
ఇలా ఒకటా, రెండా.. వందలు, వేల సంఖ్యలో నెటిజన్లు రాష్ట్ర పర్యాటక శాఖ రూపొందించిన ‘వెల్‌కమ్ టు తెలంగాణ’ వీడియోను ప్రశంసిస్తూ లైక్‌లు, షేర్‌లు చేస్తున్నారు. తెలంగాణలోని ప్రకృతి, చారిత్రక, పండుగ, సంస్కృతి సంప్రదాయాలపై తీసిన 3.05 నిమిషాల నిడివిగల వీడియో ఇప్పుడు ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తున్నది. ఈ వీడియో 13 రోజుల్లోనే (సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 9 వరకు) 20,38,437 మంది వీక్షించడం గమనార్హం.
సెప్టెంబర్ 27, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చెందేందుకు సామాజిక మాధ్యమాన్ని సాధనంగా చేసుకోవాలనే ఆలోచనతో రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు ఈ వీడియోను ఫేస్‌బుక్‌లోని సీఎంవో ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 111 దేశాలకు చెందిన ప్రజలు చూశారంటే ఆశ్చర్యం వేయకమానదు. అమెరికా నుంచే 10 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. 75 వేలకుపైగా లైక్‌లు వచ్చాయి. 24 వేల మందికిపైగా షేర్ చేయడం గమనార్హం. ఈ వీడియో కాకతీయుల రాజధాని వరంగల్ కోట నుంచి మొదలవుతుంది. లక్నవరం సరస్సు, చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, కుంటాల జలపాతం, నల్లమల అడవులు, గోల్కొండ కోట, జంతుజాలం, రామప్ప చెరువు, రామప్ప గుడి శిల్పాలు.. ఇలా అనేక అందాలను ఈ వీడియోలో చూపించారు.
దీనితోపాటు బతుకమ్మ పండుగ, చేనేత, తెలంగాణలో ఉన్న కళలకు స్థానం కల్పించారు. కాగా, ఈ వీడియోను మరింత ఆకర్షణీయంగా రూపొందించేందుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సింగరేణి, గోదావరి, కృష్ణా నదులు, ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ ప్రాజెక్టు అయిన నిజాంసాగర్‌లాంటివాటితో పాటు.. ఉస్మానియా యూనివర్సిటీ, విద్యుత్ ప్రాజెక్టులు లాంటివి మరిన్నింటిని అందులో పొందుపర్చాలని భావిస్తున్నారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..