న్యూ జెనరేషన్ ఇంటర్నెట్ టెక్నాలజీ అయిన ‘వెబ్ 3.0’ జాతీయ సదస్సు నవంబర్ 3, 4వ తేదీల్లో హైదరాబాద్ లో జరగనుంది. రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. మెటావర్స్, ఆర్ట్ గ్యాలరీస్, బిజినెస్ ఆఫీసెస్, గేమ్స్, కాసినోస్, మ్యూజిక్ వెన్యూస్, పేమెంట్ నెట్‌వర్స్, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్, ఎన్‌ఎఫ్‌టీ సావరిన్ ఫైనాన్స్ లాంటి ఎన్నో అత్యాధునిక సేవలను వెబ్ 3.0 వేదికగా పొందవచ్చు.
దాదాపు 30 ఏండ్ల క్రితం ఎన్నో పరిమితులతో ప్రారంభమైన ఇంటర్నెట్ (వరల్డ్‌వైడ్ వెబ్) కాలక్రమేణా అనేక ఆధునిక మార్పులు చెంది, ఇప్పుడు తదుపరి తరం ఇంటర్నెట్ వెబ్‌గా 3.0 మనముందుకు వచ్చింది. ఇప్పటివరకు ఇంటర్నెట్ వెబ్‌సైట్లలో చూడని ఎన్నో ప్రత్యేకతలు, ప్రయోజనాలు వెబ్ 3.0లో ఉంటాయి. ఎమర్జింగ్ టెక్నాలజీల్లో అగ్రభాగాన ఉన్న కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వెబ్ 3.0లో కీలకంగా మారింది. దీనితోపాటు బ్లాక్‌చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) లాంటి టెక్నాలజీలను వెబ్ 3.0లో వినియోగిస్తున్నారు.