గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల్ని జీహెచ్ఎంసీ అధికారులు రెండు రోజుల్లో కూల్చివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ భూముల పరిరక్షణపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన భూ అక్రమాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వేలాది ఎకరాల వక్ఫ్ భూములు ఆక్రమణకు గురైన విషయం తెలిసిన సర్కారు వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సిద్దమవుతున్నది.
మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించిన వక్ఫ్ భూములు చాలా చోట్ల కబ్జాకు గురయ్యాయి. ఎంతమంది ఎన్ని ఆరోపణలు చేసినా గత ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చిన రాష్ట్ర సర్కార్ ఎలాంటి భూ అక్రమాలను సహించబోమని, ఒక్క అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం అవ్వడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ అంశానికి సంబంధించి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శుక్రవారం సంగారెడ్డిలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
మొదట మెదక్ జిల్లా నుండి ఈ కార్యక్రమం మొదలుకానుంది. జిల్లాలో మొత్తం 30వేల ఎకరాలకు పైగా వక్ఫ్ భూములు ఉండగా వాటిలో చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయి. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్ తో పాటు 46 మండలాల తహసీల్దార్లు, ఇతర అధికారులతో హరీష్ రావు శుక్రవారం సమావేశం కానున్నారు.
