హైదరాబాద్, జూన్ 8 (టీ మీడియా): భూకంపం అంటే ఏమిటో ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం ద్వారా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రుచిచూపిస్తామని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం హెచ్చరించారు. వచ్చే సాధారణ ఎన్నికల కన్నా ముందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ‘చలో అసెంబ్లీ’ నిరసనోద్యమం ఈనెల 14న ఉదయం 11గంటలకు హైదరాబాద్ ఇందిరాపార్క్ నుంచి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ జిల్లాల నుంచి, పట్టణాలు, పల్లెలు, గూడాలు, తండాల నుంచి తెలంగాణవాదులు, ఉద్యమకారులు, గ్రామాల, మండలాల జేఏసీల బాధ్యులు తండోపతండాలుగా కదిలివచ్చి ఇందిరాపార్క్ వద్ద సమీకృతం కావాలని ఆయన సూచించారు. అడ్డంకులు, అవరోధాలు, అణచివేతలు, పాశవిక నిర్బంధకాండను ప్రతిఘటిస్తూ ‘చలో అసెంబ్లీ’ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యాచరణలో భాగంగానే ఈనెల 10న జేఏసీ భాగస్వామ్య రాజకీయ పక్షాల ప్రజాప్రతినిధుల సదస్సును నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.
రెండురోజుల్లో ‘చలో అసెంబ్లీ’పై పూర్తి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. కార్యక్షికమాన్ని భగ్నం చేసేందుకు కిరణ్ సర్కార్ తీవ్ర అణచివేతకు పూనుకుంటున్నదని, తెలంగాణలో హింసను ప్రేరిపిస్తున్నారని, తెలంగాణ ప్రజలను అశాంతికి గురిచేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రజలను పరిపాలించాల్సిన ప్రభుత్వమే హింసకు పాల్పడుతున్నదని, శాంతియుత, ప్రజాస్వామిక, చట్టబద్ధ నిరసనను హింసాపూరితం చేయడానికి కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. శనివారం తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్(తెమ్జూ) సారథ్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టీ జేఏసీ నాయకులతో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమం జరిగింది.
ఇందులో కోదండరాంతో పాటు జేఏసీ కో కన్వీనర్ వీ శ్రీనివాస్‌గౌడ్, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీప్రసాద్, తెమ్జూ అధ్యక్షుడు రమణ, ఉపాధ్యక్షుడు వాసు, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, టీఎన్జీవో ప్రధానకార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, టీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బుర్రా శ్రీనివాస్, కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోదండరాం మాట్లాడుతూ సాగరహారం, సడక్‌బంద్, సమరదీక్ష, సంసద్‌యాత్రల కన్నా సంఘటితంగా ‘చలో అసెంబ్లీ’ కోసం తెలంగాణ ప్రజలు కదలివస్తారని తెలిపారు.
జేఏసీ నాయకులు ఎన్నికల్లో పోటీచేయడం తప్పేమీకాదని, తెలంగాణ ఉద్యమం కోసం మరింత బలంగా, దృఢంగా పనిచేసేందుకే ఎన్నికల బరిలోకి జేఏసీ నాయకులు దిగుతున్నారని ఆయన తెలిపారు. ఎన్నికలు కూడా ఉద్యమవేదికలేనని అభిప్రాయపడ్డారు. తెలంగాణ జేఏసీ నాయకులు జగన్ మాదిరిగా తప్పుడు పనులు చేసి జైలుకు పోలేదని, తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కుల సాధనకోసమే ఎన్నికల్లో పోటీకి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జేఏసీ ఏ రాజయకీయ పక్షానికి మద్దతు ఇవ్వాలనే అంశాన్ని జేఏసీలో కూలంకశంగా చర్చించి, ఎన్నికల సందర్భంలోనే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. చలో అసెంబ్లీ విజయవంతం కోసం 10న బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీఐ ఎమ్మెల్యేలతో సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులను ఈ కార్యాచరణలో భాగస్వాములను ఎందుకు చేయడంలేదని ప్రశ్నించినప్పుడు కోదండరాం తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షతో ఆరు దశాబ్దాలుగా రాజకీయ క్షుద్రక్రీడ నిర్వహిస్తున్న కాంగ్రెస్‌తో కానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షను స్పష్టంగా బలపరచని టీడీపీ, వైఎస్సార్సీపీతో కానీ సంప్రదింపులు, చర్చలు జరిపే ప్రసక్తి లేదని, ఆయా పార్టీల తెలంగాణ ప్రజావూపతినిధుల ద్రోహబుద్ధిని తెలంగాణ ప్రజలకు చెబుతామని అన్నారు.
రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన నిబంధనల ప్రకారం చలో అసెంబ్లీకి అనుమతిని కోరుతూ దరఖాస్తు చేసుకున్నామని, రాజ్యాంగ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ఈ బాధ్యతను పాలకులు నిర్వర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బారీకేడ్లు కట్టి, బైండోవర్ కేసులు పెట్టి, అవరోధాలను, ఆటంకాలను, అడ్డంకులను సృష్టించి తెలంగాణను అల్లకల్లోలం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కులపైన సీమాంధ్ర పెట్టుబడి దాడి చేస్తున్నదని నిప్పులు చెరిగారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేవరకు తెలంగాణ ప్రజల సంఘటిత ఉద్యమ వేదికగా టీ జేఏసీ తుదివరకు ఉద్యమాల బాటలోనే ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామగ్రామాన కాంగ్రెస్ మెసాలను ఎండగడతామని హెచ్చరించారు.
[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]