mt_logo

ఆత్మగౌరవానికి అచ్చ తెలంగాణ రూపం

By -సవాల్‌రెడ్డి

తెలంగాణ ఆత్మగౌరవానికి నిలు రూపం కొండా వెంకట రంగారెడ్డి. ఏనాడూ ఏ విషయంలోనూ రాజీపడని మనస్తత్వం కొండాది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఆయన నెహ్రూతో ఢీకొనడానికీ వెనుకాడలేదు. పదవీ త్యాగానికీ వెన్ను చూపలేదు. సంస్థానంలో మహారాష్ట్రుల పెత్తనానికి వ్యతిరేకంగా పోటీ కాంగ్రెస్‌ను పెట్టినా, తెలంగాణ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రిని ఎంపిక చేయించినా, విశాలాంధ్రపై వ్యతిరేకత వ్యక్తం చేసినా అన్నీ నదురు బెదురు లేకుండా చేశారు. చెప్పదలుచుకున్నది నిర్మొహమాటంగా వెల్లడించడం..చేయాలనుకున్నది ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేయడం ఆయనకే చెల్లింది. 1950లోనే ఆయన తెలంగాణవాదం వినిపించారు. నిజాం కాలంలోనూ ఆ తర్వాత మిలిటరీ గవర్నర్, ఆ తర్వాత వెల్లొడీ నేతృత్వంలోనే ప్రభుత్వాల్లోనూ మహారాష్ట్రులదే పైచేయిగా ఉండడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో జరిగిన ఓ బహిరంగసభలో గొంతు విప్పారు. నిరంకుశ పాలనపోయి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మెజారిటీ ప్రజలకు ప్రాధాన్యం లేకపోవడమేమిటని నిలదీశారు.

హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బూర్గులను నిలిపి గెలిపించింది కొండాయే. నాటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దిగంబర్‌రావు బిందూను ఎన్నుకోవాలన్నది కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచన. ఆనాటి సంస్థాన కాంగ్రెస్ అధ్యక్షుడు రామానందతీర్థ వర్గం సలహాతో అధినాయకత్వం ఈ మేరకు నిర్ణయించింది. అయితే తొలి నుంచీ మహారాష్ట్రుల పెత్తనంతో సతమతమైన పరిస్థితిలో హైదరాబాద్ రాష్ట్రానికి మెజారిటీ ప్రాంతమైన తెలంగాణను కాదని ఇతరులకు అవకాశం కల్పించడాన్ని కేవీ వ్యతిరేకించారు. బూర్గుల రామకృష్ణారావును రంగంలోకి దించారు. ఇదిలా ఉంటే నెహ్రూకు తన మనసులో ఉన్న మాటను తన కార్యాలయ వర్గాలతో ఆయా నాయకులకు చెప్పించి నేరుగా తనను కలిసినపుడు ఆ మాటనే అన్ని వర్గాలతో చెప్పించి ఆమోదముద్ర వేయించడం ఆనవాయితీ. ముఖ్యమంత్రి ఎంపిక కోసం ఢిల్లీలో చర్చలకు వెళ్లినపుడు‘బిందూ ముఖ్యమంత్రి కావాలన్నది నెహ్రూ మనసులో మాట’గా నెహ్రూ కార్యాలయ వర్గాలు కేవీకి వివరించాయి. అయితే కొండా దాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించి మీరు హైదరాబాద్ వచ్చి ఎవరికి మద్దతు ఉందో పరిశీలించమని నెహ్రూకే చెప్పేశాడు. కొండాను ఎదురించే సత్తాలేక రామానంద తీర్థ తోకముడవక తప్పలేదు. బూర్గుల అధిష్ఠానం అభిమతానికి విరుద్ధంగానే ముఖ్యమంత్రి కాగలిగారు.

బూర్గులతో నెహ్రూకు మొదట్లో సత్సంబంధాలు లేవు. దీనికి తోడు ఢిల్లీ కాంగ్రెస్ లో పలుకుబడి ఉన్న రామానందతీర్థ వర్గం బూర్గులకు అడుగడుగునా ఆటంకాలు కల్పించడమే కాకుండా పదవి చేపట్టిన ఏడాదికే ఆయనను దించేందుకు రంగం సిద్ధం చేసింది. వారికి తెలంగాణలో స్థిరపడ్డ వల్లూరి బసవరాజు సహా పలువురు తెలంగాణేతర మంత్రులు కూడా తోడయ్యాడు. బూర్గుల ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ బసవరాజుతో సహా పలువురు మంత్రులు పదవులకు రాజీనామాలు ఇచ్చారు. ఈ సమయంలో నెహ్రూ దూతగా బల్వంత్‌రాయ్ మెహతా హైదరాబాద్ వచ్చి బూర్గులను తప్పుకోమని కోరారు. ఇదే విషయాన్ని కేవీకి చేరవేసి ఇది నెహ్రూ ఆదేశంగా పేర్కొన్నారు. బూర్గుల మార్పునకు కేవీ ససేమిరా అన్నారు. మీరు రాజీనామా చేయిస్తే మేం సీఎల్పీలో మళ్లీ ఆయననే ఎన్నుకుంటే ఏం చేస్తారని ఎదురు తిరిగారు. మెహతా హతాశుడై వెళ్లిపోగా నెహ్రూ పిలుపుతో ఢిల్లీ చేరిన కేవీ అదే విషయాన్ని నెహ్రూకూ చెప్పాడు.అయితే నెహ్రూ బూర్గులకు మెజారిటీ లేదని తెలిసిందని అందుకే రాజీనామా కోరామని వెల్లడించారు. తీర్థవర్గం దుష్ప్రచారాన్ని గ్రహించిన కేవీ నెహ్రూను హైదరాబాద్‌కు ఆహ్వానించి మెజారిటీ నిర్ధారణ చేసుకోవాలని సూచించా రు. ఆ మేరకు నెహ్రూ స్వయంగా ఎమ్మెల్యేలతో చీటీలపై అభిప్రాయాలు తీసుకున్నారు. బూర్గులకు భారీ మద్దతు రాగా తీర్థ వర్గానికి కేవలం మూడు ఓట్లే వచ్చాయి. దీనితో నెహ్రూ కేవీని ఆలింగనం చేసుకుని ‘ఇది మీ విజయం… కీపిటప్..బాగా చేసుకోండి’ అని వెన్నుతట్టి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఆ తర్వాత బూర్గుల కేవీ చెన్నారెడ్డిలపై ఫిర్యాదులు అందినపుడు కూడా నెహ్రూ ఈ ఫిర్యాదులపై విచారణ జరపమని కొండానే కోరారు. వీటిపై సమగ్రన్గా విచారణ జరిపిన నెహ్రూకు సవివర నివేదికను సమర్పించారు. తీర్థ వర్గం కుట్ర భగ్నమైంది. ఆయన వర్గం వారిని మంత్రివర్గంనుంచి సాగనంపి బూర్గుల రాజకీయంగా బలపడ్డారు. నెహ్రూకు విశ్వాసపాత్రుడుగా స్థిరపడ్డారు.

1953కు ముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఖాయమైనా మద్రాసు దగ్గర పీటముడి పడింది. దీనితో ఆంధ్ర నాయకుల చూపు హైదరాబాద్ వైపు మళ్లింది. తెలుగు ప్రాంతాలన్నీ కలిపి రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ వరంగల్‌లో విశాలాంధ్ర మహాసభ ఏర్పాటు చేశారు. ఆనాడు హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న కొండా తదితర తెలంగాణ నాయకులను ఆ సభకు ఆహ్వానించారు. నాటి సభలో టంగుటూరి ప్రకాశం పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు తదితర ఆంధ్రనాయకులు వచ్చారు. వక్తలు ఆంధ్ర, హైదరాబాద్ ప్రాంతాలను కలిపి రాష్ట్రం ఏర్పరచడం వల్ల కలిగే ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధిని వివరిస్తూ ఉపన్యాసాలు దంచారు. తెలంగాణ నాయకులు కవులు వంత పాడారు. కొండా తన వంతు రాగానే ‘ రెండు తెలుగు ప్రాంతాల కలయిక వల్ల ఆర్థిక, సాంస్కృతిక లాభాలుంటాయని అనేక మంది పెద్దలు చెబుతున్నారు. అయితే…మీరు చెబుతున్న ఈ లాభాలన్నీ రెండు వేర్వేరు ప్రభుత్వాలు ఉన్నా సాధించలేమా? తెలుగు సాంస్కృతికాభివృద్ధికి ఏక రాష్ట్రం కింద ఉండడానికి సంబంధం ఏమిటి?’ అని ప్రశ్నించడంతో సభికులు అవాక్కయ్యారు. ‘విశాలాంధ్ర ఏర్పాటుకన్నా… విశాల దృక్పథంతో సహజీవనం చేయడం ముఖ్యం’ అని హితవు చెప్పి విశాలాంధ్ర ప్రతిపాదనకు తన వ్యతిరేకతను విస్పష్టంగా చాటి చెప్పారు. ఆంధ్ర పత్రికలు సైతం ఈ ప్రకటనకు దిగ్భ్రాంతి చెంది కొండాది విపరీత వైఖరి అంటూ ఆడిపోసుకున్నాయి. ఆ తర్వాత అవసరం వచ్చిన అనేక సందర్భాల్లో ఆయన విశాలాంధ్రపై తన వ్యతిరేకతను వెల్లడిస్తూనే వచ్చారు.

ఫజల్ అలీ కమిషన్ నివేదిక విశాలాంధ్రకు వ్యతిరేకంగా రావడంతో ఆంధ్ర నాయకులు ఢిల్లీలో లాబీయింగ్ ముమ్మరం చేసి నాటి హోంమంత్రి పంత్‌ను ప్రభావితం చేశారు. విశాలాంధ్ర నినాదం విస్తరణతో కూడిన సామ్రాజ్యవాదమన్న నెహ్రూను సైతం ప్రభావితం చేసి ఒప్పించగలిగారు. అయితే అప్పటికే తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కావాలన్న కోర్కె తీవ్రంగా ఉంది. ఈ సమయంలో హైదరాబాద్ కాంగ్రెస్ ఈ విషయమై రెండు వర్గాలుగా విడిపోయింది. రామానంద తీర్థ, బిందూ, మెల్కొటే వంటి తెలంగాణేతరుల వర్గం విశాలాంధ్రను సమర్థించింది. కొండా నేతృత్వంలో ముఖ్యమంత్రి బూర్గుల తదితరుల కూటమి ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు పలికింది. ఈ సమయంలో ఒకసారి ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన అనంతరం బూర్గుల అకస్మాత్తుగా విశాలాంధ్రను సమర్థించడం ప్రారంభించారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో దేశంలోని పలువూపాంతాల్లో భావోద్వేగాలు పెల్లుబికాయి. బొంబాయి కోసం మహారాష్ట్రులు వీధి పోరాటాలకు దిగారు. పశ్చిమ బెంగాల్, బీహార్ ప్రాంతంలో అనిశ్చితి చోటు చేసుకుంది.

ఒరిస్సాలో కాంగ్రెస్ సభ్యులే తిరుగుబాటు చేసి రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఒక దశలో ద్విభాషా రాష్ట్రాల అంశం కూడా కేంద్రం పరిశీలనకు వచ్చింది. ఈ నేపథ్యం లో ఢిల్లీలో నెహ్రూ హైదరాబాద్ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. విశాలాంధ్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్ఠానం అనుకూలంగా ఉందని యథాప్రకారం ఆయన కార్యాలయ వర్గాలు నాయకులకు సంకేతం అందించాయి. సమావేశానికి వచ్చిన నాయకులతో ఉపాహారం చేసిన నెహ్రూ తానే స్వయంగా అందరికీ టీలు అందించా రు. ఈ సందర్భంగా విశాలాంధ్ర అంశాన్ని కొండాతో ప్రస్తావించారు. కొండా తొణక్కుండా తెలంగాణ రాష్ట్రానికే 90 శాతం ప్రజలు మద్దతు పలుకుతున్నారని దృఢంగా చెప్పారు. నెహ్రూ విస్మయం చెంది….90 శాతమా? అని రెట్టించారు. అవును… చెప్పడానికి మొహమాట పడ్డాను. నిజానికి 90 కాదు..95 శాతం మద్దతు ఉంది అని చెప్పారు. నెహ్రూ ఆశాభంగం చెందారు. బూర్గుల అది గమనించి ‘కొండా, చెన్నారెడ్డి అంగీకరిస్తే అందరూ అంగీకరించినట్టే’ అని పరిష్కారం చెప్పారు. అయితే ప్రజాస్వామ్య ప్రియుడైన నెహ్రూ 95 శాతం ప్రజలు వ్యతిరేకించాక ఇంకే ప్రతిపాదిస్తాం అని సమావేశాన్ని ముగించారు.

అయితే దొడ్డిదారిన విశాలాంధ్ర ఏర్పాటుకు అధిష్ఠానం స్కెచ్ వేసింది. కమ్యూనిస్టులు, తీర్థవర్గం, తెలంగాణేతర సభ్యుల అమోదంతో శాసన సభలో తీర్మానం చేయాలని సంకల్పించింది. బూర్గుల ఆ కార్యక్రమాన్ని తలకెత్తుకున్నారు. హైదరాబాద్ అసెంబ్లీలో 1955 నవంబర్ నెలలో విశాలాంధ్ర తీర్మానం ప్రతిపాదించారు. దీన్ని సీఎల్పీ వేదికపై కొండా తీవ్రంగా ఎండగట్టారు. ప్రజల కోరిక మేరకు వ్యవహరించాలని హితవు చెప్పారు. ఢిల్లీకి వెళ్లి తన వ్యతిరేకతను వెల్లడించారు. కేవలం ఆయన వ్యతిరేకత, కేంద్రానికి ఆయన పంపిన హెచ్చరికలు, సంకేతాల కారణంగానే ఆనాటి విశాలాంధ్ర తీర్మానం చర్చ అర్థాంతరంగా వాయిదాపడింది.

తర్వాత కాలంలో విశాలాంధ్ర ఏర్పాటు అనివార్యమైంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఖాయమయ్యాక ముఖ్యమంత్రి పదవి ఎంపిక వ్యవహారం ముందుకు వచ్చింది. ఆంధ్ర నాయకులు నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి పదవికి పోటీ పడ్డారు. ఈ సమయంలో కొండా తటస్థంగా ఉండిపోయారు. అయితే ఆయన వర్గంలోని నాయకులు మాత్రం సంజీవడ్డి గోపాలరెడ్డి వర్గాలుగా విడిపోయారు. ఈ సందర్భంగా గద్వాలలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కొండా మాట్లాడుతూ ‘ఆంధ్ర నాయకులకు తలవంచి బానిసలుగా మారి పోవడం కన్నా….జైలుకు వెళ్లడం మేలు’ అంటూ సంచలన ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటుపై ఆయనకున్న అసంతృప్తిని ఆంధ్రనాయకుల తీరుపై ఆయన అభిప్రాయాన్ని చాటి చెప్పింది. సంజీవరెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో భూమిశిస్తు పెంపు ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనను కొండా తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటికి ఆంధ్ర, తెలంగాణల్లో వేర్వేరు పన్ను విధానం అమలులో ఉండేది. తెలంగాణలో అప్పటికే వ్యవసాయ ఆదాయంపై పన్ను ఉండింది. ఆంధ్రప్రాన్తంలో ఈ పన్ను లేదు. అందువల్ల ఈ ప్రతిపాదనను ఆంధ్ర ప్రాంతానికే పరిమితం చేయాలని ఆయన వాదించారు. అయితే నాటి ప్రభుత్వం ఈ ప్రతిపాదన పక్కనబెట్టి కమిటీలతో కాలక్షేపం చేసిందే తప్ప ఆంధ్రప్రాన్తంలో వ్యవసాయాదాయంపై పన్ను విధించలేదు.

తర్వాత కాలంలో ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షపదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కేవీ రంగారెడ్డిని ఎంపిక చేయాలని నెహ్రూ భావించారు. ఈ మేరకు ఢిల్లీ స్థాయిలో నిర్ణయం, వారి నుంచి కేవీకి అభినందన సందేశాలు అందడం కూడా జరిగిపోయాయి. తీరా సీఎల్పీ నాయకుని ఎన్నిక దగ్గరకు వచ్చేసరికి కొండాలాంటి మేరు పర్వతం ఈ పదవికి చేపడితే తమ ఆటలు సాగవని ఆంధ్ర నాయకులు నాటకాలు ప్రారంభించారు. నీలం సంజీవరెడ్డి తన అనునాయుడైన బ్రహ్మానందరెడ్డిని తెర మీదికి తెచ్చారు. మరో వర్గం అల్లూరి సత్యనారాయణ రాజును దింపింది. కేవీ ఆంధ్ర నాయకుల కుట్రలను గ్రహించారు. ఆంధ్ర ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ కాబట్టి తన ఎన్నిక అసాధ్యమని గ్రహించి రెండు వర్గాల వారినీ పిలిచి రాజీ అభ్యర్థిగా దామోదరం సంజీవయ్యను ప్రతిపాదించడంతో వారు అయిష్టంగానైనా అంగీకరించక తప్పలేదు. నీలం సంజీవరెడ్డి కుట్రలకు పాల్పడకుండా ఉంటే కేవీ రంగారెడ్డి తెలంగాణ నుంచి తొలి ముఖ్యమంత్రి అయి ఉండేవారు. తర్వాత పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘనలు మితిమీరి ప్రజాగ్రహం పెల్లుబికిన సమయంలో కొండా ప్రజలవైపు నిలబడ్డారు. అనేక ఏళ్లుగా ఆంధ్ర పాలకుల వైఖరిని దగ్గరగా చూసిన అనుభవంతో హైదరాబాద్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ‘గులామీ జిందగీ సే….మౌత్ అచ్ఛీ’ అంటూ ఇచ్చిన పిలుపు తెలంగాణలో సమర నినాదమైంది. వాడవాడలా ప్రతిధ్వనించింది.

[నమస్తే తెలంగణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *