mt_logo

పాలమూరు, డిండి ప్రాజెక్టులు కట్టి తీరుతాం- హరీష్ రావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టులను కట్టి తీరుతామని, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టొద్దని కేంద్రానికి లేఖలు రాసిన ఆంధ్రా ప్రభుత్వ తీరుపై తెలంగాణ టీడీపీ నేతల వైఖరేంటో స్పష్టం చేయాలని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్ లో ఒక ప్రైవేటు కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి పెద్ది సుదర్శన్, జిల్లా అధ్యక్షులు తక్కళ్ళపల్లి రవీందర్ రావు, అర్బన్ అధ్యక్షులు నన్నపనేని నరేందర్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టులు కట్టొద్దని ఏపీ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ కేంద్రానికి ఫిర్యాదు చేయడం పట్ల తెలంగాణ టీడీపీ నేతల స్పందన ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలుగా ఉండరా? ఇంకా ఆంధ్రా తొత్తులుగానే ఉంటారా? ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని, మీరు ఆ లేఖలను సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా? స్పష్టం చేయాలని అన్నారు.

తెలంగాణ ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ ఈ ప్రాజెక్టులు తెలంగాణకు అవసరమో? కాదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మీరు తెలంగాణ బిడ్డలే అయితే ఆంధ్రా సర్కార్ కేంద్రానికి చేసిన ఫిర్యాదులను ఉపసంహరించుకునేలా చేయాలని, చంద్రబాబును ఒప్పించడం చేతకాదనుకుంటే ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలని హరీష్ రావు సూచించారు. ఇప్పటికైనా తెలంగాణ బిడ్డలుగా ఉంటారో? ద్రోహులుగా ఉంటారో తేల్చుకునే సమయం వచ్చిందని, తెలంగాణ రైతాంగానికి నీళ్ళు రాకుండా అడ్డుకునే లేఖను ఏపీ సర్కార్ ఉపసంహరించుకోకుంటే టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆపార్టీకి రాజీనామా చేయాలని హరీష్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *