mt_logo

సీమాంధ్ర నేతల కుట్రలు తిప్పికొడతాం-ప్రొ.కోదండరాం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కుట్రలు చేస్తున్నారని, వారి కుట్రలు సమర్ధవంతంగా తిప్పికొడతామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం హైదరాబాదు బషీర్‌బాగ్ లో జరిగిన తెలంగాణ హౌజింగ్ బోర్డు ఉద్యోగుల సంఘం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించిన అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ, బుధవారం ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీల జాతీయ నాయకులను కలిసి బిల్లుకు మద్దతు కోరుతామని, తెలంగాణ రాష్ట్రం వచ్చాకే హైదరాబాద్ లో అడుగుపెడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ బిల్లు ఆమోదం పొందే సమయంలో కొత్త కుట్రలతో సీమాంధ్ర నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక హౌజింగ్ బోర్డును ప్రక్షాళన చేస్తామని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకుంటే తెలంగాణలో అంతర్యుద్ధం తప్పదని తెలంగాణ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సీ.విఠల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హౌజింగ్ బోర్డు అధ్యక్షుడు వాసు, ఇతర నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *