హైదరాబాద్ లో 2022 చివరి నాటికి అమెరికా కొత్త కాన్సులేట్ భవనాన్ని ప్రారంభించనున్నట్టు యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్‌మన్ అన్నారు. విద్యుత్తు ఆదా, వర్షపు నీటి వినియోగం, సహజ శిలల సంరక్షణతో పాటు విలక్షమైన ప్రకృతి దృశ్యాలను అందించే స్థానిక మొక్కలను సంరక్షిస్తూ అధునాతన సాంకేతికత, స్థానికంగా లభించే వనరులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నామని తెలియజేసారు. హైదరాబాద్‌తో యునైటెడ్ స్టేట్స్‌కు ఉన్న బలమైన సంబంధాలకు ఇది ప్రతిరూపంగా నిలుస్తుందని అన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ వ్యాపారాలకు అనువైన వరల్డ్ క్లాస్ ఎన్విరాన్‌మెంట్ ఉంది కాబట్టే అమెరికాకు చెందిన కంపెనీలు అమెజాన్, మైక్రోసాప్ట్, గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్, బోయింగ్, లాక్‌హిడ్ మార్టిన్ లాంటి ప్రముఖ కంపెనీలు వచ్చాయన్నారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్‌లో 2016 నుంచి తెలంగాణ టాప్-3లో కొనసాగుతోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణతో అమెరికా సంబంధాలు మరింత మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ “తెలంగాణ ప్రగతిశీల విధానాలకు ఆమోదం తెలిపినందుకు, భారత్‌తో యూఎస్‌ఏ సంబంధాల్లో తెలంగాణ కీలక పాత్రను పునరుద్ఘాటించినందుకు జోయెల్ రీఫ్‌మన్‌కి ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు.

