శాసనసభలో ఈరోజు ఆర్ధిక పద్దులపై జరుగుతున్న చర్చలో భాగంగా కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బదులిస్తూ, దళితులు, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదని స్పష్టం చేశారు. బలహీన వర్గాల అభివృద్ధికి దోహదపడేలా ప్రతీ సంక్షేమ కార్యక్రమాన్ని తయారు చేశామని కడియం చెప్పారు. గీతారెడ్డి చేసిన సూచనలను తప్పకుండా పరిశీలిస్తామని, ప్లాన్డ్ బడ్జెట్ లో 15శాతం నిధులు కేటాయించామని, బడ్జెట్ లో కేటాయించిన నిధులను ఖర్చు చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని ఆయన తేల్చిచెప్పారు.
అనంతరం హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం ఏనాడూ అన్యాయం చేయలేదని, ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.