mt_logo

2004 లోనే తెలంగాణపై హామీ ఇచ్చాం-జైపాల్ రెడ్డి

లోక్ సభలో తెలంగాణ బిల్లుపై మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా తెలంగాణ ప్రాంత మంత్రి జైపాల్ రెడ్డి తీవ్ర భావోద్వేగంగా ప్రసంగించారు. తెలంగాణ పోరాటం ఇప్పటిది కాదని, 60 సంవత్సరాలుగా ఉందని, ఇన్నేళ్ళ చరిత్ర ఉన్న ఉద్యమం దేశచరిత్రలోనే ఎక్కడా లేదన్నారు. 2004లోనే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని అజెండాగా చేర్చిందని, రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఈ అంశాన్ని చేర్చిందని గుర్తు చేశారు. సీమాంధ్ర నేతలు అప్పుడే ఎందుకు అడ్డుచెప్పలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షనేత, బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ బిల్లుకు మద్దతు తెలపడాన్ని ప్రశంసిస్తూనే కాంగ్రెస్ పార్టీని నిందించటం సరికాదని అన్నారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికే కాంగ్రెస్ పార్టీ ఈ పని చేస్తుందని విమర్శించిన సుష్మాస్వరాజ్ మాటలను ఆయన ఖండించారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసినప్పుడు ఎన్నికలు లేవని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కొరకే సోనియాగాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. బీజేపీ గత 45 ఏళ్ళుగా తెలంగాణ డిమాండ్ కు మద్దతు పలుకుతుందని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండటం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఇంత విజయం దక్కిందంటే దానికి ఒకేఒక్కరు కారణమని, ఆమె చిత్తశుద్ధి వెలకట్టలేనిదని, ఆ వ్యక్తి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ అని ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *