తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికోసం కేంద్రప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని, ఎన్డీయేతో ఎలాంటి విబేధాలు లేవని రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. సోమవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు, కేంద్రంలో బీజేపీకి ఓట్లు వేసి అధికారం అందజేశారని, అందువల్ల రాష్ట్ర అభివృద్ధికై తాము కలిసి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వంతో టీఆర్ఎస్ ఘర్షణ వైఖరి ప్రదర్శించడం లేదని కేటీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణలో పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతిని, ప్రధాని మోడీని రాష్ట్ర పర్యటనకు ఆహ్వానిస్తారని తెలిపారు.