mt_logo

దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు!!

నేలపై పడ్డ ప్రతి ఒక్క చినుకునూ ఒడిసిపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ తీసుకున్న సంకల్పం ఎంతో గొప్పదని దేశంలో ఇంత గొప్ప ముఖ్యమంత్రిని చూడలేదని “వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా” గా ప్రసిద్ధి పొందిన రాజేంద్రసింగ్ ప్రశంసించారు. రాజేంద్రనగర్ లోని వాలంతరీలో యువ ఇంజినీర్లతో నిర్వహించిన కార్యక్రమంలో రాజేంద్రసింగ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేందుకు మిషన్ కాకతీయతో చిన్న నీటి వనరులకు ఊపిరి పోశారని, జనహితం కోసం జల సంకల్పంతో పని చేస్తున్న సీఎం కేసీఆర్ నదుల పునరుజ్జీవం కోసం జరుగుతున్న ఉద్యమంలో ముందు వరుసలో నిలిస్తే దేశానికి మంచి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సాగు, తాగునీటి కోసం కృషి చేస్తున్నందునే సీఎం గా రెండోసారి కూడా కేసీఆర్ ను గెలిపించారని రాజేంద్రసింగ్ అన్నారు. ఇప్పటివరకు దేశంలో 4 పెద్ద చెరువులనే పునరుద్ధరించగా, తెలంగాణలో 46వేల చెరువులు పునరుద్ధరిస్తున్నారు. చెరువుల పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో వెళ్లి చూశా.. చెరువులు పూర్వవైభవాన్ని సంతరించుకోవడం చూసి ఆనందంతో నర్సంపేట పరిధిలోని ఒక చెరువు వద్ద గతంలో నా పుట్టినరోజు జరుపుకున్నా అని ఆయన గుర్తుచేశారు.

కాళేశ్వరం పనులను కూడా స్వయంగా వెళ్లి చూశా.. మేడిగడ్డ బరాజ్ తో సాగు, తాగునీటి అవసరాలు తీరడంతో పాటు కిలోమీటర్ల కొద్దీ గోదావరి సజీవంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో జలవివాదాలు ఉన్నాయి. మహానదిపై ఒడిశా-ఛత్తీస్ గడ్ మధ్య, కావేరీపై కర్ణాటక-తమిళనాడు మధ్య వివాదం ఉంది. కానీ కాళేశ్వరం విషయంలో బేసిన్ లోని ఎగువ, దిగువ రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది, వివాదం లేకుండా అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని సీఎం కేసీఆర్ పూర్తిచేయడం గొప్ప విషయం. కేసీఆర్ లోని చతురతకు ఆశ్చర్యపోయా. ఆయన డైనమిక్ లీడర్. అందుకే ప్రజలు మళ్ళీ భారీ మెజార్టీతో ఆయనను గెలిపించారని రాజేంద్రసింగ్ ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *