హైదరాబాద్ తర్వాత అన్ని హంగులు కలిగిన నగరం వరంగల్ అని, సాఫ్ట్ వేర్ రంగంలో వరంగల్‌కు ఉజ్వలమైన భవిష్యత్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన సాఫ్ట్ పాత్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ ఇవాళ మొదటి వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నదని… అమెరికాలో స్థిరపడ్డ వరంగల్‌కు చెందిన రవి చందర్ ఈ కంపెనీని మొదట్లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి, తర్వాత దాన్ని వరంగల్‌కు విస్తరించారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సాఫ్ట్ పాత్ ఒక్కటే కాదు.. మైండ్ ట్రీ, జెన్ ప్యాక్, టెక్ మహీంద్రా, సైయంట్ లాంటి కంపెనీలన్నీ కూడా తమ కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. ఇంకా పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీని విస్తరిస్తున్నామని స్పష్టం చేశారు. సాఫ్ట్‌వేర్ రంగంలో రాబోయే ఐదేండ్లలో 50 వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అందులో కీలకమైన భూమిక పోపించే పట్టణాల్లో వరంగల్ ఉందని అన్నారు. హైదరాబాద్ తర్వాత అంత పెద్ద సంఖ్యలో కాలేజీలు, ట్యాలెంటెడ్ వర్క్ ఫోర్స్ వరంగల్‌లో మాత్రమే ఉందని, సాఫ్ట్ వేర్ రంగంలో వరంగల్‌కు ఉజ్వలమైన భవిష్యత్ ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.
1300 ఎకరాల్లో ఏర్పాటైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో మొట్టమొదటి యూనిట్‌కు ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గణేశా ఎకోటెక్ అనే కంపెనీని లాంఛనంగా ప్రారంభించామని చెప్పారు. వాటితో పాటు ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దుస్తుల తయారీ సంస్థ కిటెక్స్‌కు శంకుస్థాపన చేశామన్నారు. రూ.1600 కోట్లతో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు. యంగ్ వన్ కంపెనీ కూడా ఫైనల్ డిజైన్ అందించారు. రాబోయే రెండు నెలల్లో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇప్పటికే అన్ని ఫ్యాక్టరీలు ప్రారంభించాలి. కానీ కరోనా వల్ల ఆలస్యమైందని కేటీఆర్ తెలిపారు. రాబోయే 18 నెలల్లో కచ్చితంగా 20 వేల పైచిలుకు ఉద్యోగులు కాకతీయ పార్కులో పని చేస్తూ కనబడుతారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు శంకుస్థాన చేసిన సందర్భంగా కేసీఆర్ చెప్పిన విధంగా వస్త్ర పరిశ్రమలో వరంగల్ జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. భారతదేశానికే తలమానికంగా నిలిచేలా ఈ పార్కు రూపు దిద్దుకుంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.