ప్రతి రైతుకూ లక్షలోపు రుణాలను త్వరలోనే మాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్ లో మంగళవారం జరిగిన ఫైనాన్షియల్ సెక్టార్ కాంక్లేవ్ ముగింపు సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రుణమాఫీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకర్లతో రుణమాఫీపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
ఆగస్టు చివరివారం లేదా, సెప్టెంబర్ తొలివారంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని, అందుకోసం మన ఊరు-మన ప్రణాళిక పేరుతో గ్రామస్థాయి నుండి బడ్జెట్ అంచనాలు సేకరిస్తున్నామని వివరించారు. అన్ని రంగాల అభివృద్ధికి చక్కని ప్రణాళికతో కూడిన బడ్జెట్ ను రూపొందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ను దేశానికి రెండవ ఆర్ధిక రాజధానిగా తీర్చిదిద్దుతామని, పంచాయితీ రాజ్ సంస్థను అభివృద్ధి చేస్తామని, బ్యాంకర్లు, భీమా, ఐటీ సంస్థలతో కలిసి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సూక్ష్మ రుణాల సంస్థలతో సమస్యలు ఏర్పడి ఆత్మహత్యలు కూడా జరిగాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో రుణాలిచ్చే ఏర్పాటు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐమాక్స్ ఎండీ ఆర్ రఘోత్తమరావు, ఫ్యాప్సీ బ్యాంకింగ్ చైర్మన్ జీ శ్రీనివాస్, కెనరా బ్యాంకు సీఎండీ ఆర్ కే దూబే తదితరులు పాల్గొన్నారు.