mt_logo

విత్తన విరాట్

పనిని ఇష్టంగా చేస్తే కష్టం తెలియదంటారు!
విత్తన వ్యాపారంలో దేశంలో రెండోస్థానంలో కొనసాగుతున్న
కావేరి సీడ్స్ అధినేత గుండవరపు భాస్కర్‌రావుకు
వ్యవసాయమంటే ఇష్టం!
ఆ ఇష్టమే ఆయనచేత అద్భుతాల్ని చేయించింది!
ఆంధ్రవ్యాపారుల కుతంత్రాల్ని తట్టుకొని నిలబడేలా చేసింది!
ఆహారభద్రతకు ఆయువుపట్టుగా నిలవాలనుకుంటున్న
అతనితోనే ఈ ములాఖాత్…

 

వెయ్యి మంది రెగ్యులర్, 3వేల మంది కాంట్రాక్ట్ సిబ్బంది.. 90వేల మంది రైతులు.. లక్ష ఎకరాల్లో విత్తన ఉత్పత్తి! 15వేల మంది డిస్ట్రిబ్యూటర్లద్వారా 75లక్షల ఎకరాలకు విత్తన సరఫరా జరుగుతున్నది. తద్వారా ఏటా 900కోట్ల టర్నోవర్! విత్తన వ్యాపారంలో జాతీయ స్థాయిలో రెండో స్థానం! ఇదీ.. కావేరిసీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యాపార ప్రస్థానం. ఇదేదో టాటా, బిర్లాలో లేక అంబానిలో నడిపిస్తున్న కంపెనీ కాదు. కావేరిసీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెనుక ఒక తెలంగాణ బిడ్డ శ్రమ దాగిఉంది. అమోఘమైన అతని వ్యాపార దక్షత ఇమిడి ఉంది. అన్నదాతలకు అండగా నిలువాలనే ఆప్యాయత నిండి ఉంది. గుండవరపు భాస్కర్‌రావుకు ఈ స్థాయి ఒక రోజులో వచ్చింది కాదు. ఒక అడుగుతో మొదలైన ప్రయాణం క్రమశిక్షణతో సుదీర్ఘంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ గమ్యానికి చేరింది. అక్కడినుంచి మరిన్ని మార్గాలద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నడు జీవీ భాస్కర్‌రావు. కావేరిసీడ్స్ ప్రైవేట్‌లిమిటెడ్.. ఒక్క తెలంగాణలోనేకాదు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, బీహార్, వెస్ట్‌బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు వంటి రాష్ర్టాలతోపాటు బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్రికన్ దేశాలకూ విత్తనాలను సరఫరా చేస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ కంపెనీ కరీంనగర్‌జిల్లాలోని ఓ కుగ్రామంలో పురుడు పోసుకుంది!

విదేశీ ఆహ్వానాలను వదులుకొని..
కరీంనగర్‌జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగాపూర్ గ్రామానికి చెందిన గుండవరపు శ్రీనివాసరావు, సత్యవతిదేవిలకు ఐదుగురు మగసంతానం. అందులో మూడోవాడు భాస్కర్‌రావు. వ్యవసాయకుటుంబం. చిన్నప్పటినుంచి భాస్కర్‌రావుకు వ్యవసాయమంటే ఇష్టం. ఎప్పుడూ ఆధునిక వ్యవసాయం గురించే ఆలోచించేవాడు. ఆ ఇష్టమే అతణ్ణి వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడయ్యేలా చేసింది. అతని నలుగురు సోదరులు మెడిసిన్ పూర్తిచేసి అమెరికాలో స్థిరపడిన్రు.

భాస్కర్‌రావును కూడా అక్కడికి రమ్మని ఆహ్వానించిన్రు. అయితే అతను మాత్రం స్వగ్రామంలోనే ఉండాలనుకున్నాడు.. ఒక లక్ష్యంతో! అప్పట్లో సంప్రదాయ పద్ధతుల్లోనే వ్యవసాయాన్ని నెట్టుకొచ్చేటోళ్లు మన రైతులు! మంచి రైతు అని పేరుపొందినోళ్లుకూడా మొక్కజొన్నలు ఎకరాకు ఆరేడు క్వింటాళ్లకు మించి పంట తీసేవాడు కాదు! ఈ తరుణంలో ఆధునిక వ్యవసాయంపై భాస్కర్‌రావు దృష్టిసారించిండు. అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు లాభం చేకూర్చాలనే దిశగా ప్రయత్నాలు చేశాడు. 1976వ సంవత్సరంలో గట్లనర్సింగాపూర్‌లోని తన వ్యవసాయ భూమిలో జీవీబీ రావు అండ్ కంపెనీ పేరుతో చిన్నపాటి విత్తనోత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిండు. ఉత్పత్తి చేసిన విత్తనాలను చుట్టుపక్క గ్రామాల్లోని రైతులతో సేద్యం చేయించేటోడు. మొదటి ప్రయత్నం ఫలించింది. భాస్కర్‌రావు తయారుచేసిన విత్తనాలు మంచి దిగుబడినివ్వడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది.

కంపెనీని కొద్దికొద్దిగా విస్తరింపజేసిండు. ఐదేళ్ల తర్వాత కంపెనీ పేరును కావేరి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చిండు. అప్పటికే అది రాష్ట్రస్థాయిలో మంచి పేరుసంపాదించింది. నిజానికి ఆ సమయంలో పారిశ్రామికవేత్తలెవరూ ఉత్తరతెలంగాణవైపు కన్నెత్తిచూడని పరిస్థితి. ఊళ్లో మోతుబరులంతా పట్టణాలకు వలసవెళ్లేవారు. అయితే పేరుకు ప్రైవేట్ కంపెనీ అయినా కావేరిసీడ్స్ వ్యవసాయ అనుబంధమైనది కాబట్టి ఎవరూ భాస్కర్‌రావు జోలికి రాలేదు. దినదినాభివృద్ధితో కావేరిసీడ్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.

నిరంతర అన్వేషణ
కావేరిసీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రైతులకు మంచి దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి కోసం భాస్కర్‌రావుకే చెందిన 400ఎకరాల సొంత పొలంలో నిరంతర అన్వేషణ కొనసాగుతున్నది. అంకితభావం కలిగిన పరిశోధకులు ఎప్పటికప్పుడు కొత్త వంగడాల సృష్టికి శ్రమిస్తుంటరు. గట్లనర్సింగాపూర్‌తోపాటు హైదరాబాద్ శివారుల్లో గుండ్లపోచంపల్లి, మెదక్‌జిల్లా పాములపర్తిలోనూ కావేరిసీడ్స్‌కు ప్రయోగశాలలున్నయ్. కంపెనీ మార్కెటింగ్ బృందాలు ఎప్పటికప్పుడు రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటిస్తూ సేద్యంలో మారుతున్న అవసరాలపై అవగాహన కల్పిస్తూ ప్రోత్సాహక రాబడులను అందిస్తున్నారు.

విత్తనాలను శుభ్రపరచడం, గ్రేడింగ్ చేయడంతో నిల్వ ఉంచి ప్యాకింగ్ చేయడం కోసం ఆధునిక సదుపాయాలు కలిగిన 3లక్షల 50వేల చదరపు అడుగుల సువిశాలమైన ప్లాంట్ ఉంది. ప్రస్తుతం కావేరిసీడ్స్‌లో వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయలు, పొద్దుతిరుగుడు, కందులు, మినుములు, పెసళ్లు, సజ్జా, జవార్‌జొన్నలాంటి విత్తనాలు ఉత్పత్తి అవుతున్నయ్. ఇవేకాకుండా సూక్ష్మపోషకాలు, సేంద్రియ క్రిమిసంహారకాల ఉత్పత్తిని కూడా ప్రారంభించాలని ఆలోచనచేస్తున్నడు భాస్కర్‌రావు. అత్యుత్తమ నాణ్యత కలిగిన కాయగూరల కోసం కెక్స్‌వెజ్ అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసిన్రు.

దిగ్గజాల సరసరన..
మూడు దశాబ్దాల క్రితం చిన్న గ్రామంలో ఒక వ్యక్తి ప్రారంభించిన కావేరి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. ఫోర్బ్స్ ప్రకటించిన ప్రముఖ 200 కంపెనీలు జాబితాలో వరుసగా మూడు సంవత్సరాల పాటు చోటు సంపాదించింది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 30కంపెనీల్లో కావేరి సంస్థ ఒకటి. విత్తన వ్యాపారంలో మాత్రం జాతీయ స్థాయిలో రెండో స్థానంలో కొనసాగుతున్నాం. ఏటా 900కోట్ల టర్నోవర్‌తో 2013సంవత్సరంలో సంస్థ విక్రయ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నాం. 2014లో వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందనే శాస్త్రవేత్తల అంచనాతో మరో 20శాతం వ్యాపార అభివృద్ధి జరగవచ్చని భావిస్తున్నాంఅని భాస్కర్‌రావు అంటున్నాడు. దేశంలో వివిధకంపెనీల్లో పనిచేస్తున్న సక్సెస్‌ఫుల్ టాప్‌టెన్ సీఈవోల్లో ఒకడిగా భాస్కర్‌రావును గుర్తించాయి వ్యాపార పత్రికలు!

సేవా భాస్కరం
విత్తనవ్యాపారంలో ఎదురులేని రారాజుగా ఎదిగిన భాస్కర్‌రావు సామాజిక సేవలోనూ ముందుంటాడు. స్వగ్రామంలో నీటి ఎద్దడి నివారణకు సొంత ఖర్చుతో 10బోరుబావులను వేయించిండు. పక్కనే ఉన్న బోల్లోనిపల్లిలో హన్మంతుని దేవాలయాన్ని నిర్మించిండు. గట్లనర్సింగాపూర్, పాములపర్తి గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తుంటాడు.

పేదవిద్యార్థులకు విద్యావకాశాల్ని కల్పించడంకోసం పాములపర్తిలో ఇంగ్లీష్‌మీడియం స్కూల్‌ను ఏర్పాటు చేసిండు. మంచినీటిని అందించే మినరల్‌వాటర్ ప్లాంట్ ఒకటి కట్టించిండు. నర్సింగాపూర్‌లో 60లక్షల వ్యయంతో కల్యాణమండపాన్ని నిర్మించిండు. తెలంగాణ పారిశ్రామిక వేత్తలంటే సీమాంధ్ర వ్యాపారులకు మంట. నా కంపెనీని నామారూపాలులేకుండా చెయ్యాలని సీమాంధ్రకు చెందిన విత్తనవ్యాపారులు చాలాసార్లు ప్రయత్నించి విఫలమయిన్రు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారోత్పత్తి పెరగాలి. ఆ దిశగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు మా కంపెనీ సహకారం ఎప్పుడూ ఉంటుందని అంటాడు భాస్కర్‌రావు.

నమస్తేతెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *