mt_logo

కారు గుర్తుకు ఓటు- అభివృద్ధికి రూటు: కవిత

త్వరలో జరిగే స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో కారుగుర్తుకే ఓటువేసి కాంగ్రెస్ పాలనకు చరమగీతం పలకాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న అనంతరం కాటారం బహిరంగసభలో పాల్గొని ఆమె ప్రసంగించారు. మంథనిలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు జై తెలంగాణ అన్నా, ఏమిటని ప్రశ్నించిన వారిపైనా కేసులు నమోదు చేయించి జైల్లో పెట్టించారని, మళ్ళీ కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఇళ్ళలో ఉన్న వారిని తీసుకెళ్ళి ఇబ్బందులకు గురిచేస్తారని అన్నారు. కాంగ్రెస్ నియంతృత్వ పాలన అంతమొందించాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధును మంథని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. ఉద్యమ సమయంలో ఏసీ గదుల్లో ఉన్న కాంగ్రెస్ మంత్రులు తెలంగాణవాదులపై కేసులు పెట్టించారని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన టీఆర్ఎస్ ఉద్యమం, అమరుల త్యాగఫలితంగానే తెలంగాణ వచ్చిందని, లేకుంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్ వల్లే సాధ్యమని, పంచాయితీ నుండి పార్లమెంటు వరకు అన్ని ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రూటు వేయాలని తెలంగాణ ప్రజానీకానికి కవిత విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *