ఒక చిత్రం వెయ్యిపదాల పెట్టు అని పై చిత్రం నిరూపిస్తున్నది. ప్రజల్లోంచి ఎదిగి వచ్చిన నాయకుడెలా ఉంటాడో, అధిష్టానానికి గులాంగిరీ చేసే నాయకుడెట్లా ఉంటాడో కళ్లకు కట్టినట్టి చూపిస్తున్నదీ చిత్రం. మొన్న కాకతీయ ఉత్సవాలను ప్రారంభించదానికి వరంగల్ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికీ ఓరుగల్లు ప్రజలు అడుగడుగునా నిరసనలు తెలిపారు. రెండేండ్ల క్రితం జరిగిన కృష్ణదేవరాయల ఉత్సవాలకు దాదాపు 25 కోట్లు ఖర్చు పెట్టిన సీమాంధ్ర ప్రభుత్వం, ఇప్పుడు కాకతీయ ఉత్సవాలకు ముష్టి కోటి రూపాయలు విదల్చడంపై తెలంగాణ ప్రజలు ఆగహావేశాలు వ్యక్తం చేశారు. అందుకే వరంగల్ పర్యటనలో ముఖ్యమంత్రిపై రాళ్లు, కోడిగుడ్ల వర్షం కురిపించారు.
ఉత్సవాల ప్రారంభోత్సవ సభలో ఈ వివక్షను ప్రశ్నిస్తూ స్టేజిమీద బైఠాయించి నిరసన తెలిపిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను పై చిత్రంలో చూడొచ్చు. గత కొన్నేండ్లుగా వరంగల్ పట్టణంలో ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్న ఈ యువ ఎమ్మెల్యే ఒకప్పటి స్ఫూర్తిదాయక నాయకుడు ప్రణయ్ భాస్కర్ తమ్ముడు. చంద్రబాబు పాలనలో మంత్రిగా ఉన్న ప్రణయ్ భాస్కర్, శాసనసభలో “తెలంగాణ” పదం ఉచ్చరించరాదని అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు రూలింగ్ ఇస్తే దాన్ని ప్రశ్నించిన తెగువగల నాయకుడు.
వరంగల్ ప్రజలకు తలలో నాలుకగా మెలిగే ఈ వినయ్ భాస్కర్ వంటి వారు మనకు తెలంగాణ ఉద్యమం అందించిన ఆణిముత్యాల వంటి నాయకులైతే ఇదే ఫొటోలో చిరంజీవి పక్కన వినయంగా వంగివంగి నంగివేషాలు వేస్తున్న పొన్నాల లక్ష్మయ్య వంటివారు సమైక్య పాలన మనకు మిగిల్చిన బానిస నాయత్వపు ఉదాహరణలు.
స్వయంగా ప్రజల్లోంచి, ప్రజా ఉద్యమాల్లోంచి ఎదిగిన నాయకులు వినయ్ భాస్కర్ వంటి వారైతే, అధిష్టానం బూట్లు నాకి పదవులు తెచ్చుకుని, ప్రజల ఆకాంక్షలు ఏమాత్రం పట్టని అకశేరుకాలు పొన్నాల లక్ష్మయ్యలు.
భవిష్యత్ తెలంగాణలో మనం పొన్నాల వంటి వారిని వదిలించుకుని, మరింత మంది వినయ్ భాస్కర్ వంటి నాయకులను ఎన్నుకోవాలె.
(Photo Courtesy: Shiva Sanika)