ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద సింగరేణి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రం పనులను సీఎం కేసీఆర్ గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రాజెక్టు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని, 2015 నవంబర్ కల్లా విద్యుత్ ఉత్పాదన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఎలాంటి సాయం అవసరమైనా చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంటుందని, వారం పదిరోజులకు ఒకసారి పవర్ ప్లాంట్ కెళ్ళి ఎంపీలు, ఎమ్మెల్యేలు పనులను పర్యవేక్షించాలని సీఎం సూచించారు.
సమావేశం అనంతరం సుమారు 40 నిమిషాలపాటు ముఖ్యమంత్రి పవర్ ప్లాంటు మొత్తం పరిశీలించారు. విద్యుత్ కేంద్రం ఏర్పాటు వల్ల భూములు కోల్పోయిన బాధితులతో సీఎం మాట్లాడుతూ, బాధితులను ఆదుకుంటామని, త్వరలో మంచిర్యాల కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేస్తామని, దీనివల్ల ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలోనే మళ్ళీ మీ వద్దకు వస్తానని, మీతోనే ఒకటిన్నర రోజు కలిసి ఉంటానని, మీతోనే తింటానని, ఇక్కడే పడుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట ఎంపీ కేకే, ఢిల్లీలో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.