-రెండురోజుల్లో 29 మిలియన్ యూనిట్ల కొనుగోలులోటుపూడ్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
-యూనిట్ ధర ఎంతైనా పంటలు కాపాడటమే లక్ష్యం
-సాగర్‌లో 30 మె.వా. ఉత్పత్తి ప్రారంభం
-ఉత్పత్తి పెంచుతున్న థర్మల్ కేంద్రాలు
తెలంగాణ కరెంటు కష్టాలను కడతేర్చేందుకు ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. రైతాంగం పంటలను కాపాడటం తక్షణ లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. గత రెండు రోజులుగా ఎక్కడ విద్యుత్ అందుబాటులో ఉన్నా, ఎంత ధరకైనా వెనుకాడకుండా కొనుగోలు చేస్తున్నది. మరోవైపు అవసరాలకు అనుగుణంగా సరఫరా చేసే క్రమంలో జల, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పుంజుకుంటున్నది. ఆదివారం (ఐదో తేదీ) 18 మిలియన్ యూనిట్ల మేరకు లోటు ఏర్పడటంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలమేరకు ప్రభుత్వం యూనిట్‌కు రూ.8.62 చొప్పున 14 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలుచేసి, సరఫరా చేసింది.
సోమవారం కూడా యూనిట్ రూ.7.70ల చొప్పున 15.45 మిలియన్ యూనిట్లను కొనుగోలుచేసి, కోతలను తగ్గించింది. వాస్తవానికి ఆదివారం 156.38 మిలియన్ యూనిట్ల మేరకు డిమాండ్ ఉండగా, 137.85 మిలియన్ యూనిట్ల మేరకు విద్యుత్ సరఫరా చేయగలిగారు. దాంతో 18.53 మిలియన్ యూనిట్ల లోటు మేరకు లోడ్ రిలీఫ్ (కరెంటు కోతలు) అమలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే వెంటనే అందుబాటులో ఉన్న మేరకు 14 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడంతో లోడ్ రిలీఫ్ 4 మిలియన్ యూనిట్లకు మాత్రమే పరిమితమైంది.
2013 అక్టోబర్ 5న రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 136.48 మిలియన్ యూనిట్లవరకు ఉండగా, అంతర్గత సామర్థ్యం ద్వారా 12 మిలియన్ యూనిట్లు కలుపుకొని 130.53 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ సరఫరా జరిగింది. గత ఏడాది ఇదే రోజున కేవలం ఆరు మిలియన్ యూనిట్ల మేరకే విద్యుత్‌లోటు నెలకొని ఉండగా, ఈ ఏడాది మాత్రం ఏకంగా మూడు రెట్లు (18.53 మిలియన్ యూనిట్ల వరకు) విద్యుత్‌లోటు నెలకొనడం గమనార్హం. వాస్తవానికి ఏడాది తర్వాత పది శాతం మేరకు విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20% మేరకు విద్యుత్ డిమాండ్ పెరుగుదల చోటుచేసుకోవడం గమనార్హం.
గత పాలకుల వివక్ష, ప్రస్తుతం వేసవిని తలపిస్తున్న వాతావరణ పరిస్థితుల కారణంగా తెలంగాణ జిల్లాలను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అధికారికంగా కోతలు విధించినప్పటికీ కష్టాలు మాత్రం గట్టెక్కడంలేదు. దీంతో అవసరాలకోసం ఎక్కడ విద్యుత్ అందుబాటులో ఉన్నా, ఎంత ధరకైనా కరెంటును కొనుగోలు చేసి పంటలను కాపాడడంతో పాటు ప్రజలకు విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం పట్టుదలతో ఉంది. లోటు కారణంగా వ్యవసాయరంగానికి నిర్దేశిత విద్యుత్‌సరఫరా అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి.
వ్యవసాయరంగానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే వాతావరణ పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకోవడం, మార్చినాటి ఎండలను తలపించేలా భానుడి ప్రతాపం ఉండడం వల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిపోతున్నది. దీంతో రైతాంగం పంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికరంగానికి వారంలో ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించడమే కాకుండా పట్టణాలు, ముఖ్యనగరాల్లో కొన్ని గంటలపాటు అధికారిక కరెంటు కోతలను అమలుచేస్తున్నది. ఆ మేరకు వ్యవసాయరంగానికి మళ్లిస్తున్నారు.
హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో 5,260 వ్యవసాయ విద్యుత్ ఫీడర్లు ఉండగా, ఆదివారం ఒక విద్యుత్ ఫీడర్ ద్వారా ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా అందించారు. 2,519 వ్యవసాయ ఫీడర్లకు ఆరు గంటలపాటు, 2,628 వ్యవసాయ ఫీడర్లకు ఐదుగంటల పాటు కరెంటు సరఫరా చేయగా.. 112 ఫీడర్లకు ఐదు గంటలకు తక్కువగా సరఫరా చేయగలిగారు. ఇప్పటికే డిమాండ్, సరఫరా మధ్య అంతరం క్రమంగా పెరిగిపోతుండడంతో వీలైనంతమేరకు వ్యవసాయరంగానికి కరెంటు కోతలను తగ్గించి ఇతర గృహ, వాణిజ్య, పారిశ్రామికరంగాలకు కోతలను పెంచుతున్నారు.
సాగర్‌లో మొదలైన జల విద్యుత్ ఉత్పత్తి
నాగార్జునసాగర్‌లో 30 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. సాగర్ ఎడమకాలువ కింద తెలంగాణ రాష్ర్టానికి 60(2క్ష్30) మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన హైడల్ జనరేషన్ స్టేషన్లు ఉన్నాయి. అయితే అందులో ఒక యూనిట్‌లో గత నెలరోజులుగా ఓవరాలింగ్ పనులు జరుగుతున్నాయి. మరో యూనిట్‌లోకి సెప్టెంబర్ 18న ఒక్కసారిగా నీళ్ళు రావడంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
అందుకు దారితీసిన కారణాలపై తెలంగాణ జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు విచారణకు ఆదేశించడంతోపాటు యుద్ధ ప్రాతిపదికన యూనిట్ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. దాంతో రికార్డు స్థాయిలో సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ యూనిట్ 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. జులై 30న ప్రమాదవశాత్తు నీట మునిగిన లోయర్ జూరాలలోని మరో యూనిట్ (40 మెగావాట్లు) పునరుద్ధరణకు చర్యలను వేగవంతం చేశారు.
పూర్తిస్థాయిలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి
తెలంగాణ కరెంటు కష్టాల దృష్ట్యా టీఎస్ జెన్‌కో థర్మల్ యూనిట్లు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి దిశగా నిమగ్నమయ్యాయి. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్), వరంగల్ జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ) యూనిట్లు గత ఏడాదికన్నా 10 శాతం ఎక్కువ ప్లాంట్‌లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)తో పనిచేస్తుండడం విశేషం. థర్మల్ యూనిట్లలో చిన్నపాటి సమస్యలు తలెత్తుతున్నా యూనిట్ రన్నింగ్‌లోనే వాటికి స్వల్ప మరమ్మత్తులు చేసుకుంటూ పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించే విధంగా టీఎస్ జెన్‌కో యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లతో ముందుకు సాగుతున్నది.
సోమవారం (6వతేదీ) జెన్‌కో థర్మల్ యూనిట్ల పరిధిలో 42.13 మిలియన్ యూనిట్లు, హైడల్ యూనిట్ల కింద 20.51 మిలియన్ యూనిట్ల మేరకు మొత్తంగా 62.64 ఎంయూ విద్యుత్ ఉత్పత్తిని జెన్‌కో సాధించింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల (సీజీఎస్) నుంచి తెలంగాణ వాటాగా 16.57 మిలియన్ యూనిట్లు, ఏపీఐఎస్‌టీ ద్వారా 16.73 మిలియన్ యూనిట్లు, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కింద 1.07 ఎంయూ, థర్డ్‌పార్టీ పర్చేజెస్ కింద 1.62 ఎంయూ, పవర్ ఎక్స్చేంజ్ ద్వారా 15.47 మిలియన్ యూనిట్ల మేరకు సోమవారం విద్యుత్ సర్దుబాట్లు జరిగాయి.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..