mt_logo

తెలంగాణ ప్రజలకు ఈ విజయం అంకితం-కేసీఆర్

తెలంగాణ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదంపొందగానే టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ విజయం తెలంగాణ ప్రజలకు అంకితమిస్తున్నానని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న టీఆర్ఎస్ నేతలు, ఉద్యోగులు, కార్మికులు, తెలంగాణ జేఏసీ నేతలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని కేసీఆర్ అన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా ఎన్ని అడ్డంకులు ఎదురైనా బిల్లును ఆమోదించేలా చేసిన సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, లోక్ సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ తదితరులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. 60 సంవత్సరాలకు పైగా స్వరాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవ పోరాటాన్ని సాగించారని, రాత్రనక, పగలనక తాను ఇచ్చిన పిలుపునందుకుని ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తానెప్పుడు కోరినా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రస్తుతం మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, తెలంగాణను జయశంకర్ సార్ కు అంకితమిస్తున్నానని తెలిపారు. అమరవీరులకు కన్నీటి నివాళి అర్పిస్తున్నానని, ఉద్యోగులు, డాక్టర్లు, న్యాయవాదులు, ఆర్టీసీ, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, ప్రజలు అందరూ సకలజనుల సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. హైదరాబాద్ ను ప్రపంచంలోనే ఉన్నతంగా అభివృద్ధి చేసుకుందామని, సీమాంధ్ర ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *