mt_logo

29వ రాష్ట్రంగా తెలంగాణ

60 ఏళ్ళనాటి నిరీక్షణ ఫలించి అన్ని సంకెళ్ళను తెంచుకుని తెలంగాణ రాష్ట్రం 29 వ రాష్ట్రంగా ఏర్పాటు కానుంది. పార్లమెంటు ఉభయసభలు ఆమోదించడంతో ఎన్ని శక్తులు అడ్డుపడినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ కల సాకారమయ్యింది. సమైక్యవాదులు, శివసేన, తృణమూల్ సభ్యులు వ్యతిరేకించినా మెజార్టీ సభ్యుల ఆమోదంతో మూజువాణి పద్ధతిలో బిల్లు ఆమోదం పొందింది. బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు కొన్నిసవరణలకు పట్టుబట్టినా ప్రధాని ఇచ్చిన హామీతో వెనక్కు తగ్గారు. తెలంగాణకు తాము అనుకూలమే అని, విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసిఉండాలని, ఇరుప్రాంతాల అభివృద్ధి కోసమే విభజన జరుగుతుందని అన్నారు. వెంకయ్యనాయుడు ప్రవేశపెట్టిన సవరణలు వీగిపోవడం, కొన్నింటిని ఉపసంహరించుకోవడంతో బిల్లు ఆమోదానికి అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్రాల పరిధిలోకి వచ్చే శాంతి భద్రతలపై గవర్నర్ కు పూర్తి అధికారాలు కల్పించడానికి రాజ్యాంగ సవరణలు కోరిన వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ లతో విబేధించిన కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆర్టికల్ 3 కింద కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియలో అన్ని అంశాలను పరిష్కరించేందుకు పార్లమెంటుకు పూర్తి అధికారాలు ఉన్నాయని, ఈ విషయంలో రాజ్యాంగ సవరణ అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ సీమాంధ్రకు ఆరు సూత్రాల ఆర్ధిక ప్యాకేజీని, అవశేష ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లకు ఇచ్చిన విధంగా పన్ను రాయితీలను కల్పిస్తామని తెలిపారు. రెండు రాష్ట్రాలలోనూ పారిశ్రామికీకరణ, ఆర్దికాభివృద్ధికి కేంద్రప్రభుత్వం ప్రత్యేక సహాయాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం కోసం అవసరమైన నిధులు కేంద్రం అందిస్తుందని, ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *