By: పెన్నా శివరామకృష్ణ
బాగా పేరుపొందిన, విలక్షణమైన (సంభాషణా) శైలి కలిగిన వ్యక్తులను మాత్రమే మిమిక్రీ చేయడానికి వీలు అవుతుంది. అలాంటి ధ్వన్యనుకరణనే ప్రేక్షక శ్రోతలు పోల్చుకొని ఆనందించ గలుగుతారు. అల్లాగే సాహిత్యంలో కూడ శక్తివంతమైన, ప్రత్యేకమైన శైలి కలిగిన రచనను అనుకరించినప్పుడే ఆ ‘అనుకరణ రచన’ సఫలమవుతుంది. తెరేష్ బాబు గారి “విభజన గీత” (వి.గీ.) కూడ అలాంటి అనుకరణాత్మక అధిక్షేప రచన, అధిక్షేపాత్మక అనుకరణ రచన. ఇక్కడ అనుకరణ కేవలం హాస్యం కోసం కాదు, అధిక్షేపం కోసం. అనుకరణ, అధిక్షేపాలు సమాన స్థాయిలో నిర్వహింపబడిన మంచి రచన “వి.గీ.”
మణిప్రవాళ భాషలో, ‘అసంస్కృతా’న్ని సంస్కృతం గా భాసింప జేయడం, ఘంటశాల వారి ‘గీత’ శ్లోకాలలోని సరళ గ్రాంధిక భాషను యధాతథంగా పట్టుకోవడం, ఘంటశాల వారి గంభీర స్వరాన్ని తలపింప జేయడం మొదలైనవి ఈ ‘వి.గీ.’ లోని కొన్ని విశేషాలు. ‘వి.గీ.’ లోని ‘గీత’—–తెలుగుపదం (విభజన రేఖ) గాను, సంస్కృతపదం (గానం చేయబడినది అనే అర్థంలో) గాను ఏక కాలంలో అన్వయం కలిగి ఉండడం నామకరణంలోని నైపుణ్యం.
‘సమైక్యాంధ్ర’ అల్లరుల విన్యాస వల్లరులను చూసి ఆందోళనకు గురి అవుతున్న సగటు తెలంగాణ పౌరునికి, తెలంగాణవారి ప్రజాస్వామ్య హక్కును గుర్తించకుండా ‘అన్యథా’ భావిస్తున్నా సగటు ఆంధ్ర పౌరునికి “అపార్థా” అనే సంబోధన వర్తిస్తున్నది. “అపార్థా” అనే సంబోధనలోనే ‘పార్థుడి’ నీ, ‘అపార్థా’ న్నీ స్ఫురింపజేశారు. వ్యంగ్యం, హాస్యం ప్రధానంగా కనిపిస్తూ, పదునైన అధిక్షేపాన్ని నింపుకున్న అర్థవంతమైన ‘గీత’ ఇది. గులాబీ ముల్లు లాగా కనిపిస్తుంది. కని దాని కింద సూటిగా గుండెల్లో గుచ్చుకునే పిడిబాకులు ఉన్నాయి. ఆత్మవంచనలు, నగ్నసత్యాలు, కఠోర వాస్తవాలే ఆ కరవాలాలు. ‘జన సమీకరణలు’. ‘విభజన సమీకరణలు’ లాంటి యమకాలు, ‘మూల శంకారావాలు, లాంటి అనుకరణ పదబంధాలు మొదలైనవి తెరేష్ బాబు గారి సద్యః స్ఫూర్తికి తార్కాణాలు. నిర్దిష్ట భావజాలం, ఆలోచనలలో, అభిప్రాయాలలో స్పష్టత, వ్యంగ్య రచనా వైభవం, నిజాయితీ, నిర్భీతి మొదలైన అంశాల సమ్యక్ సమ్మేళనం ఈ ‘విభజన గీత’. పైడి తెరేష్ బాబు గారికి అభినందనలు, ధన్యవాదాలు. (రాస్తే ఇంకా విశేషాలు చాలా ఉన్నాయి.)
( ఫల శ్రుతి అను పఠన ఫలం : ఈ “విభజన గీత” ను చదివినవారికి, వినిపించిన వారికి, విన్నవారికి–ఆధిపత్య, అజ్ఞాన, ఆత్మ వంచన, పరవంచన మూలకమైన సర్వ “మూల శంకా” ది ఆధ్యాత్మిక వ్యాధులు నివారింప బడును. దృష్టికోణమునకు సంబంధించిన సర్వ దోషములు సవరింప బడగలవు.)
స్వస్తి .
***