టాటా పవర్ సంస్థ సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సర్ధానా, మరికొందరు ప్రతినిధుల బృందం శుక్రవారం సీఎం కేసీఆర్ తో సమావేశమై రాష్ట్రంలో టాటా గ్రూపు కంపెనీ పెట్టుబడులు, ప్రాజెక్టుల అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో వెయ్యి మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని, రెండేళ్లలో దీనిని పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, దానితోపాటు సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తామని అనిల్ సర్ధానా తెలిపారు. థర్మల్ పవర్ కేంద్రాన్ని పూర్తిగా తమ కంపెనీ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేస్తామని, విద్యుత్ సరఫరాకు సంబంధించిన సాంకేతిక సహకారాన్ని కూడా తామే అందిస్తామని ప్రతినిధులు సీఎం కు వివరించారు. అంతేకాకుండా బయోవేస్ట్ ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు కూడా టాటా ప్రతినిధులు ముందుకొచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం హైదరాబాద్ కు సమీపంలో ఐటిఐఆర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతుందని, ప్రస్తుతం ఉన్న కంపెనీలతో పాటు, కొత్తగా ఏర్పాటు చేయబోయే సాఫ్ట్ వేర్ కంపెనీలకు కూడా విద్యుత్ అవసరం చాలా ఉందని చెప్పారు. టాటా వంటి కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల హైదరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో 30 నుండి 40 వేల కోట్ల రూపాయల వరకు భారీగా పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా కేసీఆర్ టాటా ప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎంవో ముఖ్యకార్యదర్సి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.