విన్నూత్న కార్యక్రమాలతో తనదైన శైలిలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకుతీసుకు వెళ్తున్న తెలంగాణ మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు ఇవ్వాళ మరో గొప్ప కార్యక్రమం చేపడుతున్నాడు.
హైదరాబాదు కు కృష్ణా జలాలు అందించే కోదండాపురం నీటిశుద్ది కేంద్రం వద్ద వేనేపల్లి 24 గంటల దీక్ష చేయనున్నారు.
“హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ అయితే ఆ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమని కోదండాపురం ప్లాంటు. మా నీళ్లు తాగుతూ, మాపై కుట్రపన్నే వారికి ఇదొక హెచ్చరిక. హైదరాబాదును వేరు చేసే ప్రయత్నం చేస్తే ఈ ధమనిని కత్తిరిస్తాం. తెలంగాణ మట్టి, చెట్టు, పుట్టల సమాహారమే హైదరాబాద్. ఆ సందేశాన్నివ్వడానికే నేనిక్కడ దీక్ష చేపట్టాను. 30 జనవరి అహింసకు మారుపేరుగా నిలిచిన మహాత్మా గాంధి వర్ధంతి. మన ఉద్యమం శాంతియుతమైనదనే సందేశం కూడా నా దీక్షలో మిళితమై ఉంది” అని వివరించారు వేనేపల్లి పాండురంగారావు గారు.
ఈ దీక్షలో భాగంగా సీమాంధ్ర నుండి హైదరాబాద్ వచ్చే వాహనాలను ఆపి అందులోని ప్రయాణికులకు తెలంగాణ ఆకాంక్ష వివరించి, రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞపి చేస్తారు. దోపిడీదారులతోనే తెలంగాణకు పేచీ కానీ సామాన్య ప్రజలతో కాదని సీమాంధ్ర ప్రజలకు తెలియజేస్తారు.