mt_logo

వీరులారా వందనం…

ఫొటో: 18 జనవరి నాడు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేయేసీ నిర్వహించిన స్మృతి దీక్షలో వెయ్యి మంది ఉద్యోగులు అమరవీరుల భౌతికకాయాల వలె ఉండి నిరసన తెలిపిన దృశ్యం 

By – అల్లం నారాయణ 

పోయిన వారం. ఒక పాఠకుడు ఒక ప్రశ్న వేశాడు. ‘ఒక తెలంగాణ భూమి పుత్రుడుగా తెలంగాణ ప్రకటన వచ్చిన రోజున మీరెలా ఫీలయ్యారు’ అన్నది ప్రశ్న. “నేలకు జానెడెత్తున ఉన్నట్టు… కలా! నిజమా! అన్నట్టు.. గాయి గాయి.. ఆగమాగం. ఉద్వేగం. కొంచెం దుక్కం. అనంత సంబురం. పోటెత్తిన యాది. మనాది. మనసంత మానేరు. మాటకోనేరు.” అని జవాబిచ్చాను. తెలంగాణ అటో ఇటో తేలుతుందంటున్న ఈ సందర్భాన, తెలంగాణ అనివార్యం, ప్రకటించక తప్పదు, ఢిల్లీ సానుకూలంగా ఉంది. డీజీపీని, సీఎస్‌నూ ఢిల్లీ పిలిపించారని, బలగాలు దిగుతున్నాయని, అంతా అయిపోయింది అని అందరూ అనుకుంటున్నప్పటికీ ఇప్పుడూ అవే ఉద్వేగ భావనలు ముప్పిరిగొంటున్నవి. కొంచెం గాయిగాయిగున్నది. మనసున పట్టకుండ ఉన్నది. వస్తదని సోనియాగాంధీ స్వయంగా చెప్పినా నమ్మకం కలిగెటట్టు లేక.. వస్తదా? రాదా? ఇస్తరా? ఇవ్వరా? ఇవ్వక ఏం చేస్తరు. ప్రశ్నలు పుట్లు! సమాధానాలు? కొన్ని లేవు. కొన్ని ఉన్నవి. బహుశా తెలంగాణలో ఇవ్వాళ ఉద్యమకారుల నుంచి, సామాన్య ప్రజల దాకా ఇది గూడుకట్టుకున్న ఒక మనాదిలాగా తయారయింది. ఇస్తనంటున్నరు కదా! ఎందుకు నమ్మరు. డిసెంబర్ 9న ఇచ్చి గుంజుకున్నరు కద. ఎట్ల నమ్మాలె.

ఈ మానసిక స్థితి ఒక మౌనం లాంటిది. లోలోన రగులుకుంటున్న చింత లాంటిది. బుగులుకునే బుక్కా గుండా లాంటిది. తెలంగాణ తప్ప మరేదీ ఊహించడానికి, ఆలోచించడానికి భయపడి, ఒక్క తెలంగాణనే కలవరిస్తూ, కళ్లల్లో ఆశల దీపాలు వెలిగిచ్చుకుని బతికి ఉన్న తెలంగాణ. సరిగ్గా ఈ అనిశ్చితి. సరిగ్గా ఈ గందరగోళం. సరిగ్గా ఈ ఎటూ తేల్చని స్థితిని కల్పించిన ప్రధాన నేరస్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్లే. ఇదిగో సరిగ్గా ఇక్కడే తెలంగాణ ఉద్యమంలో మనుషులు ఎందుకు తమను తాము కాల్చుకున్నరో అర్థం అయ్యే అవకాశం ఉంది. సరిగ్గా ఈ మానసికస్థితి నుంచి ఈ అగులుబుగులు స్థితి నుంచి, ఉన్నచోట ఉండనివ్వని స్థితి నుంచి వెయ్యిమంది బలిదానాలు చూసినప్పుడే ఆ వీరుల ఆత్మ అవగతం అవుతుంది. నిజమే. తెలంగాణ తప్ప మరేదీ ఆలోచించనివ్వని, ఊపిరి సలపనివ్వని స్థితిని ఒక్క ఉద్యమమే కల్పించలేదు శత్రువు కల్పించాడు.

కరెంటోళ్లు తీగలు సవరించి, వెలుగులు విరజిమ్మే శ్రామికులు. వాళ్ల నరాల గుండా పోటెత్తిన కరెంట్ ప్రవాహం ఉంటుంది. కానీ శుక్రవారం నాడు మింట్‌కాంపౌండ్‌లో కరెంట్ తీగల గుండా దుఃఖం ప్రవహిస్తుండడం చూశాను నేను. కొన్ని కన్నీళ్లు ఉబుకుతుండగా కొంచెం దుక్కం తన్నుకొని వస్తుండగా.. అకారణంగా గుండెలోపల ఒక విషాదం గూడు కట్టుకుంటుండగా…

నిజమే వాళ్లు నిజమైన శవాలు కాదు. నిజమే మంటల్లో కాలిపోయిన శ్రీకాంతచారి, కాల్చుకుని చనిపోయిన కానిస్టేబుల్ కిష్టయ్యలు కానేకాదు. ఆమె పేరు కాశమ్మ. ఆమె నిజం. కానీ ఆమె కూడా తెలంగాణ కోసం చనిపోయిన తన కొడుకు కోసం దుఃఖాన్ని పంచుకోవడానికి మింట్‌కాంపౌండ్‌లో శవంలా నాలుగుగంటలు అట్లా ఉండిపోయింది. ఒక వెయ్యిమంది చనిపోయిన ఈనేల గురించి.. కిలోమీటర్ పొడవునా సోలుపున మూడు వరుసల శవాలు.. ఏమి శోకమిది. కాశమ్మ ఎక్కువ తక్కువ ఏమీ మాట్లాడలేదు. నా కొడుకు తెలంగాణ కోసం చనిపోయిండు. కని తెలంగాణ రాలే. ఇప్పుడింక తెలంగాణ రావాలె. జై తెలంగాణ. ఇదే కరెంట్ ఇంజనీర్ల మరో సభ విద్యుత్ సౌధలో మరో తల్లిదండ్రుల ముఖాల మీద నడయాడుతున్న దుఃఖపు ఛాయలు కూడా చూశాను నేను. అమరవీరులకు అందించే చిటికెడు సాయం కోసం మంచిర్యాల్ నుంచి వచ్చారు వాళ్లు. నికరమైన మనుషుల్లా ఉన్నారు. ఆ తల్లి ఏమీ మాట్లాడలేదు. ఉస్మానియా క్యాంపస్‌లో చెట్టుకు ఉరిపోసుకున్న సంతోష్ తల్లి. ఈ రెండు సందర్భాల్లోనూ మురికిగానూ, మోటుగానూ, మొద్దుబారినట్టుగానూ ఉన్న కాశమ్మ, సంతోష్ తల్లి ఈ ఇద్దరి కాళ్లమీద పడి అమ్మా! మీరు మాకూ తల్లులే మేమున్నాం. తెలంగాణ తెస్తాం. అని చెప్పాలనిపించింది. ఇది లోపలి బాధ. ఈ మధ్య పెద్ది శంకర్ తల్లినీ కలుసుకున్నాను. నోట మాట రాని మౌనం. దుక్కభాష. ఆమె కూడా ఒకప్పటి మా అందరి తల్లి.. ఈ తల్లుల పురిటి శోకం విచలితుణ్ని చేస్తున్నది. తెలంగాణ ఇచ్చీ మోసం చేసి వెయ్యిమంది బలిదానాలకు కారకులయినవారు ఇప్పుడు మాట్లాడుతున్నది విద్వేష భాష. అవును వాళ్లు ధ్వంసం చేస్తానంటారు.

మా రాష్ట్రం మాకు కావాలంటే మిమ్మల్ని ధ్వంసంచేస్తాననేవాడు ప్రజాస్వామ్య భారతంలో చట్టసభల ప్రతినిధి. నిజానికి లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావులకు తోడు ఇప్పుడు గుర్నాథడ్డిలు, టీజీలు, గంటాలు మోపయ్యారు. అక్కడి ప్రజాస్వామ్యవాదులు మాట్లాడరు. ఇక్కడి పత్రికలూ మాట్లాడవు. తెలంగాణ వచ్చే అవకాశం ఉన్నదీ అంటేనే చచ్చిన గొడ్డుమీద ముసిరిన జోరీగల్లాగా జమిలిగా జయ్యిమని లేస్తారు. మలి తెలంగాణ ఉద్యమం ఇప్పటికి పదహారేళ్లుగా సాగుతున్నది. ఒక విధ్వంసం జరగలేదు. ఒక్క మనిషినీ చంపలేదు. ఒక్క మనిషినీ కొట్టలేదు. ఒక మనిషినీ వెళ్లగొట్టలేదు. కంపెనీలు పెరిగినయ్. దోపిడీ పెరిగింది. సినిమాల్లో వంకరభాష పెరిగింది. ఉద్యమం మీద విద్వేషం పెరిగింది. వలస ఆధిపత్యం ఇవ్వాళ్ల విద్వేష భాష మాట్లాడేదాకా ఎదిగింది. దేశానికే తెలంగాణ ఉద్యమం ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇచ్చింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం విడిపొయ్యే రాజ్యాంగ హక్కు కోసం, శాంతియుతంగా ఉద్యమించి రాజ్యాంగ స్ఫూర్తినీ ఇచ్చింది. సమరశీలత వెల్లడి కూడా లేకపోవడం, ఆవేశకావేశాలు రగిలినా, ఆగ్రహం కమ్మేసినా ఉద్యమశాంతి స్వభావం వల్ల అణచుకోవడం, పైగా న్యాయాన్యాయాల విచక్షణ లేకుండా ‘ఉల్టాచోర్’లు ఆధిపత్యం చెలాయిస్తున్న వారు ఈ విద్వేష భాష మాట్లాడినా నిస్సహాయంగా ఉండాల్సి రావడం కూడా బహుశా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు తీసుకోవడానికి పురికొల్పి ఉంటుంది. విగ్రహాలు కూల్చినప్పటి ఉక్రోశం ఎక్కడిది? విగ్రహాలు కూల్చినప్పుడు వెల్లడయిన కోపం ఎక్కడిది. ఏ బిరడా మూతిలో బంధించి ఉంచిన ఓపిక ఒక్కసారే ఒక వెల్లువయిన ఆ ఆగ్రహ ప్రకటన అక్కడి కవులను మాట్లాడించింది. ఇక్కడి పత్రికలను మాట్లాడించింది. మహా సాంస్కృతిక విధ్వంసం అనిపించింది. కానీ కానీ.. ఓ మహానుభావులారా అక్కడి మేధావులారా! బుద్ధిజీవులారా! అక్కడి ప్రజాస్వామ్యవాదులారా! విగ్రహాలు, ఉత్త విగ్రహాలు, కూలగొడితే కూలిపోయేవి. కట్టుకుంటే నిలిచి ఉండే ఉత్త రాతిబొమ్మలు కూలగొడితే కాకిగోల చేశారే! వెయ్యిమంది మనుషుల గురించి, వాళ్ల మరణాల గురించి, వాళ్ల బలిదానాల గురించి, అత్యంత హింసాత్మక పద్ధతుల్లో తమను తాము చంపుకున్న నిలువున మంటల్లో మాడిపోయిన సజీవమైన మీమీ తెలుగు సోదరులే అయిన తెలంగాణ బిడ్డల గురించి ఒక్క మాట మాట్లాడలేదేమి? ఒక్క కన్నీటి చుక్కా మీ కరుడుగట్టిన ఎండిపోయిన కనుపాపల్లోంచి ఉబికి రాలేదేమి? అవునూ ఇప్పుడు అడుగుతున్నా ఈ మొత్తం క్రమంలో మరణించిన మనిషి ఎవడు? మాయమైన మనిషి తనం ఎవరిది?

ఒకప్పటి రాష్ట్రం. స్వతంత్ర దేశం. విలీనమైంది. షరతులు వర్తించలేదు. పెద్ద మనుషుల ఒప్పందాలు గోదాట్లో కలిసినయ్. ఆరు సూత్రాలు గంగల కొట్టుకపోయినయి. కోర్టు తీర్పులూ కాట గలిసినయ్. సెక్ర నిండింది. జీఏడీ నిండుగా ఉన్నది. కొలువులు పోయినవి. నీళ్లు పోయినయి. కూకట్‌పల్లి పోయింది. దిల్‌షుక్‌నగర్ పోయింది. వనస్థలిపురం పోయింది. సంజీవడ్డి నగర్ అయ్యింది. చిరాన్‌ఫోర్ట్ పోయింది. కేబీఆర్ పార్క్ అయ్యింది. ఇంత లావుగా బానెడు పొట్టతో బెల్టు గుంజి కట్టుకొని పగటివేషగాని వేషాలేసిన పౌరాణిక ఎన్టీఆర్ మా వీధికీ పార్కయిండు. పంచెకట్టుకున్న రాజశేఖర్‌రెడ్డి మా ఐ మూల మీద విగ్రహమయిండు. ట్యాంక్‌బండ్ అడ్డా అయ్యింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ హైహీల్స్ కింద అవ్వల్ హైదరాబాదీ కన్ను మూతపడ్డది. ఐడీపీఎల్ పోయి మొలిచిన మీ రసాయన కంపెనీల కింద మూలిగి నలిగినం. మా బాంచె నేతలు మాకు లేకుండా పోయి ఒక బాధ గాదు. ఒడువని కథ. అప్పుడు కూడా అక్కడి మేధావులు, అక్కడి ప్రజాస్వామ్యవాదులు, ఇక్కడి పత్రికలు మాట్లాడలేదు. న్యాయమడిగిన వాడు విచ్ఛిన్నకారుడయ్యాడు. విద్వేషం మాట్లాడ్తున్న వాడు సమైక్యవాది అయ్యాడు. అయ్యలారా! మీ మౌనం వెనుక ఉన్న మీ ఆధిపత్య అహంకార, కుత్సిత, కుట్రపూరిత, కొంచెపు తనాల, నీచ ప్రాంతీయ తత్వం గబ్బుకొడ్తున్నదని తెలంగాణకు తెలిసినాకనే నీళ్లకు నీళ్లు పాలకు పాలు వేరయ్యాయి. తెలంగాణ ఉద్యమం ఒక న్యాయం నుంచి, ధర్మం నుంచి, రాజ్యాంగం నుంచి, ప్రజాస్వామ్యం నుంచి మాట్లాడుతున్నది. మా రాష్ట్రం మాకు కావాలి. విలీనం వల్ల మాకు కల్గిన బాధల నుంచి మాకు విముక్తి కావాలె.

ఎంత పాచిపండ్ల వారు మీరు. ముతక వాసనేస్తున్న పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. వాదనే లేదు. ఎంత పురాతనమైన వాళ్లు మీరు. మీ వాదనలు వింటుంటే ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలు కూలినచోట మిమ్మల్ని సజీవంగా నిలబెట్టినా ఫరక్ రానంత. అంత పురాతనమైనవాళ్లు. అంత పాచి మాట్లాడ్తున్న వాళ్లు. చెప్పీ చెప్పీ, చెప్పీ అయినా బొందలో శవాన్ని తవ్వినట్టు, దేనికీ నిలబడని ఉత్తబోలు మాటలను జోరీగల్లా ఒకరి ఒకరుగా మాట్లాడ్తుంటారు. ఒక మేధావట అంటాడూ. హైదరాబాద్‌కు గుంటూరు నుంచి పైసలొస్తె కట్టినారట. ఇంకా నయం. రాష్ట్రం విడిపోతే నీటి సమస్య వస్తుందట. నీళ్లన్నీ మళ్లించుకుపోయినవాడు, మహబూబ్‌నగర్‌ను శాశ్వత వలస ప్రాంతం చేసిననాడు, బొగ్గునాల బొగుడల మీద బొండిగలకు ఉరిపోసుకుంటూ నీటి ఊటలేని బతుకులు గడిపే తెలంగాణ సంగతి మాట్లాడని వారు రాబోయే డెల్టా నీటి కష్టం సంగతి మాట్లాడతాడు. పైగా అదీ కష్టజీవుల భాషలో. ఎంత కుత్సితులు మీరు. మనసుల్లో నింపుకున్న, నిలు మూర్ఖత్వపు సంకుచిత, ప్రాంతీయ తత్వం. కారంచేడులో మనుషులను ముక్కలుచేసినవాడే రాష్ట్రం ముక్కలు కాకూడదంటాడు. అంతటితో ఆగదు. ఆర్థిక ఆధిపత్యం, వనరుల మీద పెత్తనం కోసం ఇక్కడి దొరలు మళ్లా తెలంగాణ పేరిట వస్తున్నాడని మరొకడంటాడు. సందులేకుండా హైదరాబాద్‌ను ఆక్రమించుకొని, లక్షల ఎకరాలను అక్రమంగా కబ్జాపెట్టి, ధాతూ ఫిర్యాదులేని ఆర్థిక అరాచక పెత్తనంతో, నిధులిక్కడివీ ఖర్చులక్కడ పెడ్తున్న వాడే ఈ భాష మాట్లాడతాడు. పైగా సామాజిక న్యాయం అంటాడు. నీరుకొండలు, కారంచేడులు, కంచికచెర్లలు చేసిన నయాదొరలే.. ఇక్కడి దొరతనం బూచిచూపుతారు. ఏమి చాతుర్యం? కానీ కానీ..

మీ చీకటి కొట్టాలకు నిప్పులంటుకుంటున్నయి. మీది పోయే కాలం. రానున్న కాలం మాదే. ఇస్తరా! ఛస్తరా! మీ ఇష్టం.. కానీ.. తెలంగాణ వచ్చేదాకా తెచ్చుకునే పోరాటం మాది. అక్కడి బుద్ధిజీవులారా! అక్కడి ప్రజాస్వామ్యవాదులారా! అక్కడి కవులారా! కళాకారులారా!అక్కడి కలం వీరులారా! నిజమే తెలుగు వాళ్లం కలిసి ఉంటే బాగానే ఉంటుంది. కానీ కలిసిఉన్న వారికి ఎదురైన తెలంగాణ వేదన, పీడనల వల్ల కలిసి ఉండలేము. ఇది నూరు పాళ్ల నిజం. ఒకన్ని వేధిస్తూ, పీడిస్తూ, దోపిడీ చేస్తూ, తన ప్రాంతంలో తనను పరాయివాణ్ని చేసిన వలసవాదులవల్ల మా దశాబ్దాల జీవితం తల్లడిల్లింది. అదిప్పుడు కొట్లాడుతున్నది. తప్పదిది అంతిమ పోరాటం. మీరు విజ్ఞులైతే విద్వేష భాష మాట్లాడుతున్న వారికి బుద్ధి నేర్పండి. మనం విడిపోయినా ఒకే భాష మాట్లాడే సోదరులం అని చెప్పండి. ఎవరి రాష్ట్రం వాళ్లకుంటే వచ్చే నష్టమేమీలేదని చెప్పండి. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవదని చాటండి. మీరిప్పుడు మాట్లాడండి. ఇవ్వాళ నేను ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన మోదుగుపూలవనాన్ని ఎన్జీవోల భవన్‌లో చూశాను. అవును వాళ్లు నిలబడే వున్నారు. స్వతంవూతంగా తమ మనసునిండా దట్టించిన ఆలోచనల అవగాహనలతో.. తెలంగాణ వచ్చిందా సరే! రాలేదా! అయినా సరే! ఇప్పుడు మళ్లీ ఒక వెయ్యి మంది మరణాల సంగతీ మాట్లాడుకుందాం. తల్లులారా! మీ గర్భశోకాలను ఆర్చడానికి, తీర్చడానికి మేమున్నాం. తెలంగాణ రాదా! అయినా సరే! వచ్చేదాకా మేముంటాం. పోరాడుతాం. విద్యార్థులు లేని తెలంగాణ ఉద్యమం లేదు. విద్యార్థులు లేని తెలంగాణ ఉండదు. పోగొట్టుకున్న బిడ్డల స్థానంలో మెదడునిండా విప్పపూల వనాలను నింపుకున్న ధీరోధాత్తులను చూశాను. అన్ని విశ్వవిద్యాలయాలూ పోటెత్తి ఉన్నాయి. అవిప్పుడు నివురు గప్పిన నిప్పులు.. ఇస్తారా! ఇవ్వరా! సందేహం లేదు. ఇప్పుడిక ఇది బలిదానాల తరం కాదు. తమకు తాము మరణించిన కాలానికి చెల్లు.. మేం బలికాము. మరణించం. తెలంగాణ రాకపోతే శత్రువే బలికావలసి వస్తుందని చెబుతున్న విద్యార్థి సూర్యుళ్లకు వందనం. తల్లులకు వందనం. మీ కొడుకుల జెండాను ఎత్తి పట్టుకున్న వాళ్లందరికీ వందనం. ఇక ఇప్పుడు కొంచెం నిమ్మళం. తెలంగాణ వస్తుంది. వస్తుంది. తెచ్చుకుంటాం..

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *