హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ ను రాజధానికి ధీటుగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్రానికి మంజూరయ్యే యూనివర్సిటీలు, సంస్థలు వరంగల్ కు కూడా తరలిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సోమవారం వరంగల్ లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టెక్స్ టైల్ పరిశ్రమ, జిల్లా అభివృద్ధి, ఔటర్ రింగ్ రోడ్, కాకతీయ ఉత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వరంగల్ సమీపంలోని దేవనూరులో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, లక్ష మరమగ్గాలతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఈ పరిశ్రమ రాకతో వరంగల్ రూపురేఖలు మారతాయని, వస్త్ర పరిశ్రమకు వరంగల్ కేరాఫ్ అనే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో టెక్స్ టైల్ పార్క్ ఉంటుందని కేసీఆర్ తెలిపారు. వస్త్ర పరిశ్రమకు పేరెన్నికగన్న తమిళనాడులోని తిర్పూర్, గుజరాత్ లోని సూరత్ కు తీసిపోకుండా ఇక్కడి టెక్స్ టైల్ పార్కులో లక్ష పవర్లూమ్స్ ప్రారంభిస్తామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని, నగరంలో రహదారులు, జంక్షన్లను అభివృద్ధి చేయాలని, త్వరలో జరగనున్న కాకతీయ ఉత్సవాలు దేశం దృష్టిని ఆకర్షించేలా ఘనంగా ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఇప్పటికే కిక్కిరిసి పోయిందని, కొత్తగా వచ్చే యూనివర్సిటీలు, ఐటీ కంపెనీలను వరంగల్ కు తరలిస్తామని, దీనివల్ల వరంగల్ జనాభా కొద్ది సంవత్సరాల్లోనే రెట్టింపు అవుతుందని కేసీఆర్ చెప్పారు.
సుమారు 20 లక్షల జనాభా నివసించేందుకు అనువుగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాలని, దీనికోసం రాంపూర్ నుండి హన్మకొండ చౌరస్తా, పోచమ్మ మైదాన్ నుండి ధర్మారం వరకు ఉన్న ప్రధాన రహదారిని 150 ఫీట్ల వరకు, హంటర్ రోడ్, ఆర్ఈసీ –కేయూసీ-పెద్దమ్మగడ్డ రహదారిని 150 ఫీట్ల మేరకు విస్తరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి రాజయ్య, మంత్రులు అజ్మీరా చందూలాల్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీలు కడియం, అజ్మీరా సీతారాం నాయక్, బూరనర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.