
సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే మెజారిటీ నిర్ణయాలు ఏదో రకంగా వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా మీడియా & కమ్యూనికేషన్స్ డైరక్టర్‌గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని కాకుండా ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిని నియమించడంతో అగ్గి రాజుకుంది.
గత కొన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి మీడియా, సోషల్ మీడియా సేవలందిస్తున్న డెక్కన్ క్రానికల్ ఎడిటర్ శ్రీరాం కర్రిని మీడియా & కమ్యూనికేషన్స్ డైరక్టర్‌గా రెండేళ్ల పాటు నియమిస్తూ సమాచార, పౌర సంబంధాల శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి శ్రీరాం కర్రి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజులకే దావోస్ పర్యటనకు ఎలాంటి అధికారిక హోదా లేకున్నా కేవలం శ్రీరాం కర్రిని మాత్రమే రేవంత్ వెంటపెట్టుకొని వెళ్ళాడు. ఆ తరవాత ఇటీవల సీఎం అమెరికా టూర్‌లో కూడా కర్రి హల్‌చల్ చేశాడు.. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. ఒక వార్తాపత్రికకు ఎడిటర్‌గా ఉంటూ.. ప్రభుత్వ అధికారిక పర్యటనలో భాగం అవ్వడమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం ఏంటని పలువురు ముక్కున వేలేసుకున్నారు. ఇదే విషయం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వరకూ చేరింది.
ఇప్పటికే పార్టీలో, పాలనలో, పార్టీ సోషల్ మీడియాలో పక్క రాష్ట్రానికి చెందిన ఒక పార్టీ వారి పెత్తనం ఎక్కువైంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. రేవంత్ విదేశీ పర్యటనలో తమకు ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా.. కాంగ్రెస్ ఎన్నారైలైతే రేవంత్ తీరుపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇప్పుడు మీడియా డైరక్టర్‌గా శ్రీరాం కర్రిని సెలెక్ట్ చేయడంతో అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేని.. ఏనాడు ఉద్యమంలో పాల్గొనని కర్రికి ఈ పదవి కట్టబెట్టడం ఏంటని తమ వాట్సాప్ గ్రూపుల్లో జర్నలిస్టులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ఘోరంగా విమర్శించిన సదరు వ్యక్తికి ఈ పోస్ట్ ఇవ్వడం ఏంటని రేవంత్‌ని జర్నలిస్టులు తూర్పారపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. నిజానికి శ్రీరాం కర్రి నియామకం ఐటీ శాఖ ద్వారా చేయాలని రేవంత్ భావించాడు.. కానీ తన శాఖలో తనని సంప్రదించకుండా నియామకం ఏంటని మంత్రి శ్రీధర్ బాబు కర్రి ఫైల్‌ను పక్కకు పెట్టేయడంతో.. రేవంత్ రెడ్డికి వేరే దారిలేక ఐ&పీఆర్ శాఖ ద్వారా శ్రీరాం కర్రికి ఈ బాధ్యతలు అప్పజెప్పాడు.
రాజముద్రలో కాకతీయ తోరణం తొలగింపు, సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం బదులు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు వంటి అనాలోచిత చర్యలతో తెలంగాణ అస్తిత్వాన్ని రేవంత్ మంటగలుపుతున్నాడని ఇప్పటికే రేవంత్ రెడ్డిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నయి. ఇలాంటి నేపథ్యంలో ఎంతో ముఖ్యమైన మీడియా డైరక్టర్ పదవికి తెలంగాణ వాళ్ళు ఎవరు దొరకలేదా అని రేవంత్ రెడ్డిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
బహుశా బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు వార్తలను వండి వడ్డించే పాత్రను నిర్వర్తించినందుకు గాను గుర్తింపుగా రేవంత్ శ్రీరాం కర్రికి ఈ పదవి కట్టబెట్టి ఉంటాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే.. ఈ అంశంలో రేవంత్ తన వేలితో తన కంటినే పొడుచుకున్నాడని అనిపిస్తుంది.